సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్ల మేర మోసం చేసిన కేసులో సినీ నటి అషురెడ్డికి (కొయ్య వెంకట అశ్విని రెడ్డి) త్వరలో నోటీసులు జారీ చేయాలని నగర సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. లండన్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వైవీ ధర్మేంద్ర తరఫున ఆయన తండ్రి ఎనుముల సత్యనారాయణ మూర్తి ఇచి్చన ఫిర్యాదు మేరకు అషురెడ్డిపై ఈ కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం... ధర్మేంద్ర 2018లో ఇక్కడ ఉన్నప్పుడు అషు రెడ్డిని కొందరు పరిచయస్తుల ద్వారా కలిశాడు.
పరిచయమైన రెండు నెలల్లోనే ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. ధర్మేంద్ర తనకు అప్పటికే వివాహమైందని, విడాకులు ప్రక్రియలో ఉన్నాయని చెప్పినా... అది సమస్య కాదని చెప్పిన అషురెడ్డి సంబంధాన్ని కొనసాగించింది. తన హెచ్1బీ వీసాలో కొన్ని సమస్యలు ఉన్నాయని, విద్యా రుణం ఉందని, తండ్రికి ఆర్థికంగా సహాయం చేయడానికే చదువును ఆపేశానని వివరించింది. తాను నటిగా ఎదగడానికి భారత్‌కు వచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని ధర్మేంద్రను కోరింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడు నమ్మి ఆమె ఖర్చులను భరించడం మొదలెట్టాడు.
కొన్నాళ్లకు అషురెడ్డి తన నెలవారీ ఖర్చులు, వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనం కోసం డబ్బులు అడగటం మొదలుపెట్టింది. అలాగే కార్లు, బంగారం, ఆస్తులు తన పేరుతో కొనిపెట్టమని కోరింది. అయితే 2020 జూలైలో ధర్మేంద్ర పెళ్లి ప్రస్తావన తెచి్చనప్పుడు చేసుకోనని అషురెడ్డి చెప్పింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరాడు. అయితే రూ.70 లక్షలు తిరిగి ఇస్తానని అంగీకరించి ఖాళీ చెక్కులు ఇచ్చి ఆ తరువాత పట్టించుకోలేదు. కొద్ది రోజుల తరువాత మళ్లీ పెళ్లి ప్రస్తావన రావడంతో అతడు నమ్మి వారితో సంబంధాన్ని కొనసాగించాడు.
భారీ మొత్తంలో డబ్బు, ఆస్తులు, దాదాపు ఐదు కిలోల బంగారం ధర్మేంద్ర నుంచి తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా అతడిని అల్లుడిగా సంబోధిస్తూ, వారి ఖర్చులు భరించమని ఒత్తిడి చేశారు. మొత్తం ఐదేళ్లలో సుమారు రూ.9.35 కోట్లు ఇలా ధర్మేంద్ర నుంచి తీసుకున్నారు. దీనికి అదనంగా అషురెడ్డి చెల్లెలు రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు తొలుత ధర్మేంద్ర తండ్రి నుంచి అవసరమైన అన్ని పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లావాదేవీల రికార్డులు తీసుకోవాలని నిర్ణయించారు. ఆపై ఈ కేసులో నిందితులుగా ఉన్న అషురెడ్డితో పాటు ఆమె తండ్రి, సోదరి, తల్లి తదితరులకు నోటీసులు జారీ చేయనున్నారు.


