మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఎట్టకేలకు ఊరట
ఇంటి స్థలం, వడ్డీ ఎప్పుడిస్తారన్న హైకోర్టు
తదుపరి విచారణ 17కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన ఒంటరి మహిళలు, పురుషుల న్యాయపోరాటం ఫలించింది. ఎట్టకేలకు పునరావాసం, పునర్నిర్మాణం పథకం నిబంధన మేరకు పరిహారం అందింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే మంగళవారమే ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది.
కాగా బుధవారం విచారణ నేపథ్యంలో ఇంటి స్థలం, వడ్డీ చెల్లింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిహారం పంపిణీ చేసినందున పిటిషన్లపై విచారణ ముగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచి్చంది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా హాజరు కాకపోవడంపై ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది.
79 మందిలో సగం మందికే పరిహారం!
ఒంటరి మహిళలు, పురుషులను కుటుంబంతో కలిపి చూడకుండా వారికి ప్రత్యేకంగా లెక్కించి రూ.12.50 లక్షల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన 27 మంది, వేములఘాట్‌కు చెందిన 52 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్లను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం అందజేయాలని సర్కార్‌ను ఆదేశించింది.
అయినా పరిహారం పంపిణీ చేయకపోవడంతో కొందరు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. 8 వారాలు గడువిస్తే నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేస్తామని సర్కార్ గతేడాది జూలైలో హామీ ఇచి్చంది. కానీ నెలలు గడిచినా పరిహారం పంపిణీ చేయకపోవడంతో గత నెలలో కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఈ మేరకు బుధవారం జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్డీ, ఇంటి స్థలం అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమలు చేయనప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరుకావాలి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణ వాయిదా వేశారు. ఈ కేసులో మొత్తం 79 మంది పిటిషన్లు దాఖలు చేస్తే అందులో సగం మందే పరిహారం అందుకోవడం గమనార్హం. మిగతా సగం మంది మరణించారు.


