మూర్తీ’భవించిన రామానుజ స్ఫూర్తి

Chinna Jeeyar Swamy Prophecy To Police Security In Millennium Celebrations - Sakshi

సహస్రాబ్ది ఉత్సవాల భద్రతకు వచ్చిన పోలీసులకు చినజీయర్‌స్వామి ప్రవచనం

శంషాబాద్‌ రూరల్‌: నేటి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలను రూపుమాపడానికి, రామానుజుల స్ఫూర్తిని అందించడానికి సమతామూర్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చెప్పారు. బుధవారం నుంచి జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం వచ్చిన పోలీసులకు ఆయన ప్రవచనం చేశారు. రామానుజుల విశిష్టతను తెలియజేశారు.

కూలీలు మొదలుకొని రైతుల, చిరు ఉద్యోగులు ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చారన్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం చాలా ఉందన్నారు. సమారోహ ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలని సిబ్బంది, అధికారులకు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఘట్టానికి సుమారు 7 వేల మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిమగ్నం కానున్నారు. 

ప్రధాన యాగశాల ఏర్పాట్లు పూర్తి
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలకు ప్రధాన యాగశాలను సిద్ధం చేశారు. మరోవైపు సినీ చిత్ర కళాకారుడు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో ప్రవచన మండపంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. రెండు వేల మంది సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ మండపం నుంచే ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు వారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇవ్వనున్నారు. యాగశాల సమీపంలో ప్రభుత్వ వైద్యశాఖతో పాటు యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సేవల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top