ఇంటి భోజనం తెచ్చుకోండి.. ఇంటి నుంచే పని చేయండి! | Advice to bring food from home due to gas shortage | Sakshi
Sakshi News home page

ఇంటి భోజనం తెచ్చుకోండి.. ఇంటి నుంచే పని చేయండి!

Apr 9 2026 4:25 AM | Updated on Apr 9 2026 4:25 AM

Advice to bring food from home due to gas shortage

పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీల్లో ఈ దిశగా చర్యలు

క్యాంటీన్లలో గ్యాస్‌ కొరతతో ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచన

వర్క్‌ ఫ్రం హోం చేయాలంటున్న మరికొన్ని కంపెనీలు.. 

పెట్రోల్, డీజిల్‌ ఇబ్బందులతో ఉద్యోగుల పికప్, డ్రాప్‌లకు బ్రేక్‌లు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నేపథ్యంలో అప్పట్లో ఐటీ సంస్థలలో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధంతో మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌ మొదలైంది. అయితే ఈసారి కొన్ని బహుళ జాతి సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని సూచిస్తే.. మరికొన్ని కంపెనీలేమో ఇంటి నుంచి పని చేయాలని చెప్పాయి. 

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్‌ వంటి ఇంధన వనరుల కొరత తీవ్రమైన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల వాహన వినియోగం తగ్గింది. టెక్నాలజీ సంస్థలు నిత్యం ఉద్యోగస్తుల పికప్, డ్రాప్‌ సర్వీస్‌లనూ తగ్గించాయి. 

మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల కొరత ఐటీ ఆఫీసు క్యాంటీన్లలో మెనూ తగ్గింది. దీంతో ఐటీ సంస్థలు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) తమ ఉద్యోగులకు మళ్లీ ఇంటి నుంచి పని, హైబ్రిడ్‌ వర్క్‌ మోడళ్లను అవలంబిస్తున్నాయి. ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాల్లో హైబ్రిడ్, వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. 

ఇంటి నుంచి భోజనం..
వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, మియాపూర్‌ ఐటీ కారిడార్లలో వసతి గృహాల్లో వంట గదులకు తాళం వేశాయి. ఆఫీసు క్యాంటీన్లలో వెండర్లు సేవలను నిలిపివేశాయి. దీంతో పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు క్యాంటీన్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. 

వీలైనంత వరకూ ఉద్యోగులు సొంత ఆహారాన్ని తెచ్చుకోవడం (బ్రింగ్‌ యువర్‌ ఓన్‌ ఫుడ్‌) విధానాన్ని పాటించాలని చెప్పాయి. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైన నేపథ్యంలో కంపెనీలు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడని ప్రత్యామ్నాయ ఆహార విక్రేతలతో ఒప్పందం చేసుకుంటున్నాయి.  

తగ్గిన ఆన్‌సైట్‌ వర్క్‌
బహుళ జాతి సంస్థలు ఆన్‌సైట్‌ వర్క్‌ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రధానంగా బడా ఐటీ సంస్థలు అమెరికా, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో ఉద్యోగులను ఆన్‌సైట్‌కు పంపిస్తుంటాయి. అయితే తాజాగా ఆయా దేశాల్లో యుద్ధ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రయాణ పరిమితులను అమలు చేస్తున్నాయి. 

ఉద్యోగుల భద్రత కోసం ఆన్‌సైట్‌ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, కేపీఎంజీ, జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్‌ సాక్స్, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ వంటి ప్రధాన టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల భద్రత, వ్యాపార కొనసాగింపు భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement