లంచం డిమాండ్‌.. ఏసీబీ వలలో సీఐ, ఎస్‌ఐ! | ACB Raids On Vikarabad Women Police Station | Sakshi
Sakshi News home page

లంచం డిమాండ్‌.. ఏసీబీ వలలో సీఐ, ఎస్‌ఐ!

Apr 22 2026 9:50 AM | Updated on Apr 22 2026 9:50 AM

ACB Raids On Vikarabad Women Police Station

అనంతగిరి: వికారాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ సరోజ, ఎస్‌ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్‌ ఇర్షాద్‌ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్‌తో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్‌కు ఫోన్‌ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్‌కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్‌ఐ డిమాండ్‌ చేశారు. 

తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్‌ సీఐ సమక్షంలో ఎస్‌ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్‌ మహిళా పీఎస్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్‌ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు లేదా 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు.   

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం.. 
తాండూరు: పట్టణానికి చెందిన కౌన్సిలర్‌ షేక్‌ ఇర్షాద్‌ అవినీతి అధికారుపై పోరాటం చేస్తున్నారు. ఓ భూమికి సంబంధించిన సేల్‌ డీడ్‌ రద్దు చేయాలని కోరుతూ 2022 డిసెంబర్‌లో తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ జమీరొద్దీన్‌ను కలవగా రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన ఇర్షాద్‌ డిసెంబర్‌ 5న డబ్బులు ఇస్తూ సబ్‌ రిజి్రస్టార్‌తో పాటు అతని అసిస్టెంట్‌ను పట్టించాడు. 2025లో ఇంటి నంబర్‌ కేటాయించేందుకు లంచం డిమాండ్‌ చేసిన మున్సిపల్‌ ఉద్యోగి రమేశ్‌ను ఏసీబీకి పట్టించాడు. దంపతుల మధ్య నెలకొన్న గొడవ విషయంలో ఇర్షాద్‌ భార్య మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, స్టేషన్‌ బెయిల్‌కు లంచం డిమాండ్‌ చేసిన పోలీసు అధికారులను ఏసీబీకి పట్టించడం చర్చనీయాంశమైంది.    

 

Advertisement
 
Advertisement
Advertisement