బెల్ట్ ఏకరూపకం
ఇది కోదాడలోని కట్టకొమ్ముగూడెం వీధిలో ఉన్న బెల్ట్ దుకాణం. కొత్తవారు సైతం సులువుగా గుర్తు పట్టడానికి వీలుగా డబ్బాకొట్టు చుట్టూ గ్రీన్‌మ్యాట్ కడతారు. డబ్బాకొట్టు ఉండి దానికి మూడు వైపుల గ్రీన్ మ్యాట్ కట్టి ఉంటే అది బెల్ట్ దుకాణమని గుర్తు పట్టేందుకే ఈ ఏర్పాట్లు. కోదాడ పట్టణమే కాదు జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా ఇదే విధంగా కనిపిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేకుండా గ్రీన్ మ్యాట్ ఉన్న డబ్బాకొట్టు దగ్గరికి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తుంటారు. ఈ దుకాణాలు అన్ని వేళలా అందుబాటులో ఉండడం విశేషం.
కోదాడ : పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విచ్చల విడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అన్ని షాపులు ఒకే మోడల్‌లో కనిపించే విధంగా వాటిని ఏర్పాటు చేస్తుండడం విశేషం. గతంలో గ్రామానికి ఒకటి రెండు కనిపించే బెల్ట్ దుకాణాలు ఇపుడు ప్రతి వీధిలో రెండంకెల స్థాయికి చేరాయి. ప్రతి గ్రామంలో ఇదే ప్రధాన వ్యాపారంగా మారింది. గ్రామ రాజకీయాలకు, వ్యవహారాలకు ఈ దుకాణాలే కేంద్ర బిందువులుగా మారాయి. చిన్నా..పెద్ద తేడా లేకుండా వచ్చిన వారందరికీ అవసరమైన బ్రాండ్లు సరఫరా చేయడం వీటి ప్రత్యేకతగా మారింది.
వ్యతిరేకులకు గాలం..
గతంలో గ్రామంలో బెల్ట్‌షాపుల ఏర్పాటును యువజన సంఘాలతో పాటు చదువుకున్న యువకులు గట్టిగా వ్యతిరేకించేవారు. దాంతో అమ్మకాలు చేసే వారుకూడా గుట్టుగా వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. బెల్ట్ దుకాణదారులు ఏదో ఒక రాజకీయపార్టీకి సానుభూతి పరుడిగా ఉంటూ వారి అండదండలతో దుకాణాలను నడుపుతున్నారు. గ్రామంలోని యువకులను చేరదీసి అరువుకు మద్యాన్ని ఇస్తుండడంతో వారు కూడ వ్యతిరేకించడం మానేశారు. ఎకై ్సజ్ పోలీసులు సైతం బెల్ట్ దుకాణాలను ప్రొత్సహిస్తున్నారని, సివిల్ పోలీసులు వీటి గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఊళ్లను పంచుకొని వ్యాపారం..
వైన్స్ దుకాణా దారులు గ్రామాలను పంచుకొని అక్కడి బెల్ట్ దుకాణాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఒకరి పరిధిలోని గ్రామాలకు మరొకరు మద్యం సరఫరా చేయకూడదనే నిబంధన అమలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం కోదాడ మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులకు పట్టణంలోని వైన్స్ యజమానులు మద్యం సరఫరా చేశారు. దాంతో వైన్స్ యజమానుల మధ్య గొడవలు జరిగి రోడ్డెక్కారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమలుకు నోచని ఎస్పీ హామీ
ఆరు నెలల క్రితం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో పోలీసుశాఖ యువత కోసం నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు పలు సమస్యలను లేవనెత్తారు. తమ గ్రామంలో బెల్ట్ దుకాణాల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారారని, గ్రామంలో పదికి పైగా బెల్ట్ దుకాణాలున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని యువకులు ఎస్పీని కోరారు. ఈ విషయమై విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు ఒక్క బెల్ట్ దుకాణం కూడా మూత పడలేదని ఆ గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బాకొట్టుకు మూడు వైపులా గ్రీన్ మ్యాట్.. ఇదే బెల్ట్ షాపుల కోడ్
ఫ కొత్తవారైనా సులువుగా
గుర్తుపట్టేలా ఏర్పాట్లు
ఫ గ్రామాలు, పట్టణాల్లో విచ్చల విడిగా బెల్ట్ దుకాణాలు
ఫ అధికారులు పట్టించుకోక పోవడంతో జోరుగా వ్యాపారం


