'ఇండియన్ ఏజెంట్' అన్నారు.. ఇప్పుడు ఏకంగా బోర్డు ప్రెసిడెంట్‌గా | Tamim Iqbal appointed BCB President by Bangladesh government after T20 World Cup fiasco | Sakshi
Sakshi News home page

Tamim Iqbal: 'ఇండియన్ ఏజెంట్' అన్నారు.. ఇప్పుడు ఏకంగా బోర్డు ప్రెసిడెంట్‌గా

Apr 7 2026 5:48 PM | Updated on Apr 7 2026 6:22 PM

Tamim Iqbal appointed BCB President by Bangladesh government after T20 World Cup fiasco

బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. దిగ్గ‌జ ఓపెన‌ర్ త‌మీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌గా ఎంపిక‌య్యాడు. మంగళవారం అమినుల్ ఇస్లాం నేతృత్వంలోని బోర్డును రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం.. బీసీబీకి కొత్త చీఫ్‌గా త‌మీమ్‌ను నియ‌మించింది. 

కాగా గత అక్టోబర్‌లో జరిగిన బోర్డు ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  వీటిపై ఇటీవల ఆ దేశ క్రీడా మంత్రి అమీనుల్ హక్ విచారణకు ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఈ ఆరోపణలన్నీ నిజమేనని తేల్చడంతో, ప్రభుత్వం తక్షణమే బోర్డు ఆఫ్ డైరెక్టర్లను తొలగించింది. 

ఈ క్రమంలోనే అమినుల్ ఇస్లాం స్ధానంలో బీసీబీ అధ్యక్షుడిగా తమీమ్ ఇక్బాల్ బాధ్యతలు చేపట్టనున్నాడు.  39 ఏళ్ల తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించనున్నాడు. 11 మంది సభ్యులతో కూడిన బీసీబీ అడ్హక్ కమిటీకి తమీమ్ నాయకత్వం వహించనున్నాడు. 

ఈ బీసీబీ కమిటీలో మాజీ కెప్టెన్ మిన్హాజుల్ అబెడిన్, రష్నా ఇమామ్, మీర్జా యసీర్ అబ్బాస్, సయ్యద్ ఇబ్రహీం అహ్మద్, ఇస్రాఫిల్ ఖస్రు, తంజీల్ చౌదరి, సల్మాన్ ఇస్పాహానీ, రఫీకుల్ ఇస్లాం వంటి వారు ఉన్నారు. తమీమ్ ఎంపికను బంగ్లాదేశ్ జాతీయ క్రీడా మండలి (NSC) డైరెక్టర్ మహమ్మద్ అమీనుల్ అహెసాన్  ధృవీకరించారు. తమ నిర్ణయం గురంచి అంతర్జాతీయ క్రికెట్ మండలికి(ICC)కి తెలియజేసినట్లు అహెసాన్ తెలిపారు.

కాగా తమీమ్ ప్రెసెడెంట్‌గా బాధ్యతలు చేపట్టడంతో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని తమీమ్ తప్పు పట్టాడు.  దీంతో అప్పటి బోర్డు సభ్యులు "ఇండియన్ ఏజెంట్" అని విమర్శించారు. అటువంటిది త‌మీమ్ ఇప్పుడు ఏకంగా చైర్మెన్‌గా ఎంపికై వారంద‌రికి షాకిచ్చాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement