ఆరో స్థానంలో షఫాలీ | Shafali ranked sixth in ICC Womens T20 rankings | Sakshi
Sakshi News home page

ఆరో స్థానంలో షఫాలీ

Apr 22 2026 12:58 AM | Updated on Apr 22 2026 12:58 AM

Shafali ranked sixth in ICC Womens T20 rankings

ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్‌

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆకట్టు కుంటున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ... అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేసింది. సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్న షఫాలీ వర్మ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి... ఆరో ర్యాంక్‌కు చేరింది. డర్బన్‌ వేదికగా జరిగిన రెండో టి20లో షఫాలీ 38 బంతుల్లోనే 57 పరుగులు చేసింది. 

అంతకుముందు తొలి మ్యాచ్‌లో షఫాలీ 34 పరుగులతో మెరిసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఈ ప్రదర్శనతో తాజా ర్యాంకింగ్స్‌లో షఫాలీ 731 పాయింట్లతో ఆరో ‘ప్లేస్‌’కు చేరింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (762 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమైంది. టాప్‌–10 ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ఈ ఇద్దరే చోటు దక్కించుకున్నారు. 

ఆ్రస్టేలియా ప్లేయర్‌ జార్జియా వాల్‌ (815 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బెత్‌ మూనీ (788 పాయింట్లు; ఆ్రస్టేలియా), హేలీ మాథ్యూస్‌ (767 పాయింట్లు; వెస్టిండీస్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (639 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 11వ ర్యాంక్‌కు చేరగా... జెమీమా రోడ్రిగ్స్‌ (637 పాయింట్లు) నాలుగు ర్యాంక్‌లు కోల్పోయి 14వ స్థానంలో ఉంది. 

బౌలర్ల విభాగంలో దీప్తి శర్మ (705 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంక్‌కు చేరగా... రేణుక సింగ్‌ (699 పాయింట్లు) నాలుగు స్థానాలు చేజార్చుకొని 9వ ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement