ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ | Santner out of IPL 2026 with shoulder injury, Keshav Maharaj in as replacement | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ

Apr 27 2026 9:08 PM | Updated on Apr 27 2026 9:27 PM

Santner out of IPL 2026 with shoulder injury, Keshav Maharaj in as replacement

ఐపీఎల్‌ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతూ, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక స్పిన్నర్ మిచెల్‌ సాంట్నర్‌ భుజం గాయం కారణంగా సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహారాజ్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది.

ఈ సీజన్‌లో సాంట్నర్‌ను గాయాల సమస్య వెంటాడింది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

తరువాత కోలుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో మళ్లీ అదే భుజానికి గాయమైంది. దీంతో అతను సీజన్‌ మొత్తానికే దూరమవాల్సి వచ్చింది.

సాంట్నర్ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ముంబై బౌలింగ్ విభాగంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సాంట్నర్‌ దూరం కావడం ముంబై ఇండియన్స్‌కు భారీ దెబ్బగా పరిగణించబడుతుంది.

ప్రత్యామ్నాయంగా మరో స్టార్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ను తీసుకున్నప్పటికీ.. అతను ఏ మేరకు ముంబై కష్టాలను తీర్చగలడో చూడాలి. సాంట్నర్‌ తరహాలోనే ఎడమచేతి స్పిన్నర్ అయిన మహారాజ్‌కు టీ20ల్లో అపార అనుభవం ఉంది. అతడు 218 టీ20 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు.

ముంబై ఏప్రిల్ 29న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. కేశవ్ మహారాజ్ రాకతో జట్టు బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement