ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? | Kohli Makes Time For Childhood Coach-Inaugurates Cricket Academy | Sakshi
Sakshi News home page

IPL 2026: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?

Apr 28 2026 3:20 PM | Updated on Apr 28 2026 3:34 PM

Kohli Makes Time For Childhood Coach-Inaugurates Cricket Academy

ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజ‌న్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న మూలాల‌ను మాత్రం మ‌రిచిపోలేదు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్ అనంత‌రం ఆర్సీబీ జ‌ట్టు ఢిల్లీ వీడిన‌ప్ప‌టికీ కోహ్లి మాత్రం త‌న స్వ‌స్థ‌లంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్ర‌ధాన కార‌ణ‌ముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడ‌మీ (డ‌బ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. 

దీని ప్రారంభోత్స‌వానికి కోహ్లితో పాటు అత‌డి చిన్న‌నాటి కోచ్ రాజ్‌కుమార్ శ‌ర్మ కూడా హాజ‌ర‌య్యారు. ఇది త‌న కోచ్ రాజ్‌కుమార్ శ‌ర్మ క్రికెట్ అకాడ‌మీ కావ‌డంతో ఆయ‌న మీద గౌర‌వంతో కోహ్లి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్య‌క్ర‌మంలో భాగంగా అకాడ‌మీ స్టూడెంట్ల‌కు కోహ్లి అవార్డులు అంద‌జేశాడు. 

ఈ నేప‌థ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్ల‌ను మొక్కే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ కోహ్లి వ‌ద్ద‌ని వారించి అత‌డికి షేక్ హ్యాండ్ ఇచ్చి హ‌గ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడ‌మీలోని స్టూడెంట్స్‌ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వ‌య‌సులోనే  క్రీడ‌ల‌ను నా కెరీర్‌గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజ‌యితీతో చేయాల‌నుకున్నా. అందుకే క్రికెటర్ కావాల‌ని ధృడంగా నిర్ణ‌యించుకున్నా. ఈ స‌మ‌యంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వ‌ద్ద నిజాయితీగా ఉన్నాను. 

ఇక వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్లు త‌మ ఆశ‌యాల ప‌ట్ల పూర్తి నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌తో ఉండాల్సిన అవ‌స‌ర‌ముంది. మీరు కంటున్న క‌ల‌ల ప‌ట్ల‌, ఏమి చేయాల‌నుకుంటున్నార‌నే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు వంద‌శాతం నిజాయితీతో క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం మ‌న‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తోంది’ అని చెప్పుకొచ్చాడు.  

ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.

ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్‌లాడి 351 ప‌రుగులు సాధించాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 44 బంతుల్లోనే 81 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక సోమ‌వారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. 

ఢిల్లీతో మ్యాచ్‌లో 23 ప‌రుగులు చేయ‌డం ద్వారా ఐపీఎల్‌లో 9వేల ప‌రుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 9వేల ర‌న్స్ పూర్తి చేసుకున్న తొలి ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కెక్కాడు.

చదవండి: ‘ఎందుకీ డబుల్‌ గేమ్‌?’.. వినేశ్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ ఆగ్రహం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement