ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత ఇలాకాలో (అహ్మదాబాద్) చిత్తుగా ఓడించింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత గుజరాత్‌కు ఎదురైన తొలి ఓటమి ఇది. మరోవైపు ముంబైకు నాలుగు వరుస పరాజయాల తర్వాత వచ్చిన తొలి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తిలక్ శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్‌ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
ఈ గెలుపుపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లాంటి కఠిన వేదికపై గెలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మైదానంలో ముంబై ఇండియన్స్‌కు గతంలో పెద్దగా విజయాలు లేవు. ఈసారి మంచి క్రికెట్ ఆడి విజయం సాధించడం ప్రత్యేకంగా అనిపించింది. ఈ గెలుపు జట్టుకు అత్యంత అవసరమైంది.
మ్యాచ్‌లో కీలక మలుపు 14వ ఓవర్ టైమ్‌ఔట్ తర్వాత వచ్చింది. ఆ సమయంలో తిలక్ వర్మకు ఓ సందేశం ఇచ్చాను. బంతిని గమనించి, ధైర్యంగా కొట్టు అని చెప్పాను. తిలక్ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది, అతను తన సహజ ఆట ఆడితే చాలు అన్న భావనతో ప్రోత్సహించాను. చివరికి తిలక్ అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.
బౌలింగ్‌లో బుమ్రా వినియోగంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎప్పుడైనా ఉపయోగించవచ్చని, అతను ప్రత్యేకమైన బౌలర్ కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా అతన్ని వినియోగించడం ముఖ్యమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో కొత్త బంతితోనే ప్రభావం చూపాలని నిర్ణయించి, బుమ్రాను ప్రారంభంలోనే బౌలింగ్‌కు తీసుకురావడం విజయానికి దోహదపడిందని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. అరంగేట్రం బౌలర్ కృష్ మంచి లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడని, అశ్వనీ కుమార్ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. గత సీజన్‌లో కూడా అతను ఇదే తరహా ప్రదర్శన చేసినట్లు గుర్తు చేశాడు.
అదనంగా ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగ్గా రాణించిందని, ముఖ్యంగా నమన్ ప్రదర్శనను ప్రశంసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ఇక దూసుకుపోతామని పరోక్షంగా చెప్పాడు.


