భారత ఐపీఎల్‌ ఆటగాళ్లకు విదేశీ అంతర్జాతీయ జట్టులో చోటు | International Team Grants Citizenship To 5 Players Amid Rashid Khan's BCCI Leak | Sakshi
Sakshi News home page

భారత ఐపీఎల్‌ ఆటగాళ్లకు విదేశీ అంతర్జాతీయ జట్టులో చోటు

Apr 20 2026 12:20 PM | Updated on Apr 20 2026 12:34 PM

International Team Grants Citizenship To 5 Players Amid Rashid Khan's BCCI Leak

భారత్‌, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్‌ చేశాయని, వారి దేశాల తరఫున క్రికెట్‌ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకువచ్చాయని, అయితే తాను వాటిని సున్నితంగా తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ సంచలన విషయాలను తన పుస్తకం "Rashid Khan: From Streets to Stardom" ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఈ విషయంపై క్రికెట్‌ సమాజంలో చర్చలు జరుగుతుండగానే, ఐసీసీ అసోసియేట్‌ మెంబర్‌ అయిన యూఏఈ (UAE) పలువురు విదేశీ క్రికెటర్లకు పౌరసత్వం ఇచ్చి చర్చను మరింత విస్తృతం చేసింది.

యూఏఈ తొలిసారి ఐదుగురు విదేశీ క్రికెటర్లకు ఒకేసారి పౌరసత్వం మంజూరు చేయడంతో పాటు తమ జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని కూడా కల్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో విదేశీ ఆటగాళ్లు యూఏఈ క్రికెట్ జట్టుకు ఆడాలంటే మూడు సంవత్సరాల నివాసం అర్హతగా ఉండేది. తాజాగా ఆ దేశం రూల్స్‌ను సవరించి పౌరసత్వం ఇవ్వడంతో పాటు నేరుగా జాతీయ జట్టులోకి తీసుకొని సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది.

యూఏఈ పౌరసత్వం పొంది, ఆ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో ఖుజైమా తన్‌వీర్, అజయ్ కుమార్, అదీబ్ ఉస్మానీతో పాటు ఆకాశ్‌దీప్‌ నాథ్‌, హర్ప్రీత్‌ భాటియా లాంటి ఐపీఎల్‌ ఆటగాళ్లు ఉన్నారు. యూఏఈ జట్టు త్వరలో నేపాల్ పర్యటనకు వెళ్లనుండగా, ఈ ఆటగాళ్లు 17 సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.

అక్షదీప్ నాథ్ ఐపీఎల్‌ సహా ఉత్తరప్రదేశ్ తరఫున 200కి పైగా మ్యాచ్‌లు ఆడి 6500కి పైగా పరుగులు సాధించాడు. హర్‌ప్రీత్ భాటియా  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ జట్ల తరఫున భారీ అనుభవం కలిగిన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.

మొత్తంగా చూస్తే, ఒకవైపు రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు దేశం పట్ల నిబద్ధతను చూపుతుండగా, మరోవైపు యూఏఈ వంటి దేశాలు విదేశీ ప్రతిభను ఆకర్షిస్తూ తమ దేశ క్రికెట్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముంది.
 

Advertisement
 
Advertisement
Advertisement