టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన | England pick 18 year old Tilly Corteen Coleman for Women's T20 World Cup | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. సంచలన ఎంపిక

Apr 28 2026 4:05 PM | Updated on Apr 28 2026 5:28 PM

England pick 18 year old Tilly Corteen Coleman for Women's T20 World Cup

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026కు మరో నెలన్నర సమయం ఉండగానే ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా నాట్‌ స్కీవర్‌ బ్రంట్‌ ఎంపిక కాగా.. ఆమెకు డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) ఛార్లీ డీన్‌ ఎంపికైంది.

ఈ జట్టుకు ఓ సంచలన ఎంపిక జరిగింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండానే 18 ఏళ్ల టిల్లీ కార్టీన్‌-కోల్‌మన్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అయిన టిల్లీ, సర్రే తరఫున అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి కీలక బలంగా మారే సామర్థ్యం ఆమెకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ జట్టుకు ఇస్సీ వాంగ్‌, లారెన్‌ ఫైలర్‌ కూడా ఎంపికయ్యారు. వీరికి ఇదే తొలి టీ20 ప్రపంచకప్‌. మొత్తంగా ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్‌ జట్టు కొత్త వారు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. 

ఈ జట్టు ఎంపికపై హెడ్‌ కోచ్ ఛార్లోట్‌ ఎడ్వర్డ్స్‌ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక చాలా కఠినమైన ప్రక్రియగా మారిందన్నారు. ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటం ఇంగ్లండ్ మహిళా క్రికెట్ బలాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న ఈ ప్రపంచకప్ తమకు ప్రత్యేకమని, అభిమానుల మద్దతుతో గొప్ప ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

కాగా, జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 జరుగనుంది. ఈ మెగా టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్‌లుగా (ఏ, బీ) విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ​్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఉన్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement