‘చద్దా.. మా వల్లే నీ వివాహం జరిగింది’ | AAP leader Saurabh Bharadwaj Serious On Raghav Chadha | Sakshi
Sakshi News home page

‘చద్దా.. మా వల్లే నీ వివాహం జరిగింది’

Apr 28 2026 7:19 AM | Updated on Apr 28 2026 7:49 AM

AAP leader Saurabh Bharadwaj Serious On Raghav Chadha

ఢిల్లీ: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా.. కేజ్రీవాల్‌కు షాకిస్తూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆప్‌ నేతల నుంచి సోషల్‌ మీడియాలో నెటిజన్ల వరకు చద్దాపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాను పార్టీ మారడాన్ని చద్దా సమర్ధించుకుంటూ.. జస్ట్‌ ఉద్యోగం మారినట్టు పార్టీ మారాను అని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.

ఎంపీ రాఘవ్ చద్దా వ్యాఖ్యలపై ఆఫ్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా భరద్వాజ్‌.. ఏడాది కాలంగా బీజేపీతో కలిసి రాఘవ్ చద్దా కుట్ర పన్నాడు. మధ్య తరగతి ప్రజల సమస్యలపై ప్రస్తావించే నాయకుడిగా ఇమేజ్ బిల్డ‌ప్‌ చేసుకోవడం కూడా అందులో భాగంగానే జరిగింది. రాఘవ్‌ చద్దా ఎంపీ కావడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ కారణం. ఆప్‌ వల్లే ఆయన ఎంపీ అయ్యారు. రాజ్యసభ ఎంపీని చేయడం వల్లే రాఘవ్ చద్దాకు గుర్తింపు వచ్చింది. ఆ హోదా కారణంగా అతనికి పెళ్లి జరిగింది. ఓ సెలబ్రెటీ ఆయనను పెళ్లి చేసుకున్నారు. లేకపోతే రాఘవ్ చద్దాను ఎవ‌రూ పట్టించుకునే వారు కాదు.

రాజకీయాలను ఉద్యోగాలతో పోల్చవద్దు. మనం ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఒక కంపెనీలో పనిచేసినప్పుడు, దానికి సిద్ధాంతంతో సంబంధం లేదు. మీరు సిద్ధాంతం కారణంగానే ఒక పార్టీలో చేరి, దానిలో ఉన్నారు. ప్రజలు ఉద్యోగాలు మారినప్పుడు కూడా, వారు తమ మాతృ సంస్థకు వ్యతిరేకంగా కుట్రలు చేయరు అని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. ఆ సందర్బంగా ఆయన ఆప్‌ను “toxic work environment” అని పిలిచారు. ఆయన ప్రకారం, పార్టీలో పని చేయడాన్ని అడ్డుకోవడం, పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడం, పార్టీ అవినీతిలోకి వెళ్లడం వల్లే తాను ఆప్‌ను వీడినట్లు చెప్పారు. ఒక ఉద్యోగి ఎలా అయితే కంపెనీ మారుతారో అలాగే నేను కూడా పార్టీ మారాను అని అన్నారు. అంతటితో ఆగకుండా..‘నేను రాజకీయాల్లో కెరీర్ కోసం రాలేదు. నేను ఒక పార్టీని స్థాపించాను. నా యవ్వనంలో 15 సంవత్సరాలు రక్తం, చెమట, కష్టంతో ఈ పార్టీకి ఇచ్చాను. నేను భయంతో కాదు, నిరాశ, అసంతృప్తి, అసహ్యం వల్లే పార్టీని విడిచాను. ఒక వ్యక్తి తప్పు కావచ్చు, ఇద్దరు తప్పు కావచ్చు, కానీ ఏడు మంది తప్పు కావడం సాధ్యం కాదు’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement