కోల్‌కతా ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్‌కు గురవుతున్నాయి. తృణముల్ ఎంపీ సాగరిక ఘోష్‌తో పాటు సమాజ్ వాద్ పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అసలేం జరిగింది?
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా బంకురాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగీ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ "మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను" అన్నారు.
అయితే దీనిపై తృణముల్ ఎంపీ యోగీ ఆదిత్యానాథ్‌కు కౌంటరిచ్చారు. "యోగీ ఆదిత్యానాథ్ గారు ఆ వ్యాఖ్యలు చేసింది స్వామి వివేకానంద కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్" అన్నారు. యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు "బెంగాల్ చరిత్ర పట్ల బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని, ధిక్కారాన్ని" బట్టబయలు చేసిందని పేర్కొన్నారు.
అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం స్పందించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీస్తున్నాయన్నారు.
కాగా ఈ వ్యాఖ్యలు 1944 జూలైలో బర్మాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడమని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) సైనికులను ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఆసమయంలో సుభాష్ చంద్రబోస్ ఐఎన్‌ఏ సైనికులనుద్దేశించి "నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను" అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ప్రచారం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 23న తొలిదశ ఎన్నికలు జరగునుండగా, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


