అద్భుతం.. 320 కోట్ల ఏళ్ల నాటి చరిత్ర సాక్ష్యాలు | Scientists' research reveals sensational findings on the Chotanagpur Plateau | Sakshi
Sakshi News home page

అద్భుతం.. 320 కోట్ల ఏళ్ల నాటి చరిత్ర సాక్ష్యాలు

Apr 20 2026 1:48 PM | Updated on Apr 20 2026 2:01 PM

Scientists' research reveals sensational findings on the Chotanagpur Plateau

సాక్షి : నేడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, ఖనిజ సంపదతో అలరారుతున్న . ఒకప్పుడు నిశ్శబ్దంగా అలలు ఎగసిపడే మహా సముద్రం అంటే నమ్మగలమా? కానీ, భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలు ఇదే నిజాన్ని రూఢీ చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ, సింగ్‌భూమ్ ప్రాంతాలు 320 కోట్ల ఏళ్ల క్రితం విశాలమైన జలరాశిలో ఉండేవని, ఆధునిక ప్రపంచానికి ఇది అత్యంత పురాతనమైన 'సాగర రహస్యం' అని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. 

భూమి పరిణామ క్రమంలో ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి నేతృత్వంలోని బృందం చేసిన అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది. సుమారు 3.2 బిలియన్ అంటే 320 కోట్ల ఏళ్ల క్రితమే సింగ్‌భూమ్ ప్రాంతం సముద్రం నుంచి పైకి ఉద్భవించింది. అంటే, భూమిపై ఏర్పడిన అత్యంత పురాతన ఖండాంతర భూభాగాలలో ఇది మొదటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ లభించిన 'జిర్కాన్' స్పటిక రేణువుల విశ్లేషణ ద్వారా ఆ కాలంలోనే నదులు, తీర ప్రాంతాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి.

మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులు..

రాంచీ దాని పరిసర ప్రాంతాల్లోని శిలలు మిలియన్ల ఏళ్ల నాటి చరిత్రకు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తున్నాయి. భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నితీష్ ప్రియదర్శి ప్రకారం, ఇక్కడ కనిపించే ఇసుకరాయి, సున్నపురాయి, పగడపు శిలాజాలు ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదని స్పష్టం చేస్తున్నాయి.కాంగ్లోమరేట్లు.. నీటి ప్రవాహం వల్ల గుండ్రంగా మారిన రాళ్లతో కూడిన ఈ అవక్షేప శిలలు సముద్ర నిక్షేపణకు ప్రధాన సాక్ష్యం. పట్రాటు సమీపంలోని బెంటి బాగ్దా ప్రాంతంలో లభించే సున్నపురాయి సాధారణంగా నిస్సారమైన సముద్ర వాతావరణంలోనే ఏర్పడుతుంది. పట్రాటు నుండి బర్కగావ్ వెళ్లే దారిలోని రాళ్ల ఆకృతులు, ఒకప్పుడు అలల తాకిడికి గురై రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తాయి.

కోట్లాది ఏళ్ల క్రితం భూమి లోపల జరిగిన టెక్టోనిక్ కదలికల కారణంగా ఒకప్పుడు నీటి అడుగున ఉన్న ఈ భూభాగం నెమ్మదిగా పైకి లేచింది. భారతదేశం 'గోండ్వానా ల్యాండ్'లో భాగంగా ఉన్న కాలంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దామోదర్ లోయ ప్రాంతం ఒకప్పుడు చిత్తడి నేలలు లేదా నిస్సార సముద్రంగా ఉండేదని, అందుకే అక్కడ నేడు భారీ స్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఏర్పడ్డాయని నిపుణులు వివరిస్తున్నారు.సముద్రానికి, మానవ పరిణామానికి ఉన్న ఈ విడదీయలేని బంధాన్ని గుర్తుచేస్తూనే.. భారతదేశం ప్రతి ఏటా ఏప్రిల్ 5న 'జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని' జరుపుకుంటుంది. 

ప్రాచీన కాలం నుంచి సముద్ర వాణిజ్యంలో భారత్ అగ్రగామిగా ఉండటమే కాకుండా, మన నేల గర్భంలో దాగి ఉన్న ఇటువంటి భౌగోళిక రహస్యాలు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. నేడు మనం రాంచీ కొండలపై నిలబడి చూస్తున్న దృశ్యం వెనుక, కోట్లాది ఏళ్ల క్రితం సముద్రపు అలల సంగీతం దాగి ఉందన్నది కాదనలేని వాస్తవం.

పసుపులేటి. వెంకటేశ్వరరావు

Advertisement
 
Advertisement
Advertisement