ఢిల్లీ, సాక్షి: "సర్కే చునార్ తేరీ సర్కే"పాటలో అశ్లీలత, మహిళలను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై వచ్చిన ఆందోళనలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం నటుడు సంజయ్ దత్ జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు జయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్‌కు లిఖితపూర్వక క్షమాపణను సమర్పించారు. ఈ విషంయంపై విచారం వ్యక్తం చేస్తూ, సృజనాత్మక కంటెంట్‌లో మహిళలకు బాధ్యతా యుతమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం
ఒక దిద్దుబాటు చర్యగా, సామాజిక సంక్షేమానికి , మహిళా సాధికారతకు సానుకూలంగా దోహదపడే దిశగా, సంజయ్ దత్ 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించారు. ఇకపై, సినిమాలు మరియు సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో మహిళలు ,పిల్లలకు గౌరవప్రదమైన మరియు సముచితమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను చేర్చుతానని సంజయ్ దత్ కమిషన్‌కు హామీ ఇచ్చారు.
ఈ విచారణ సందర్భంగా ఎన్‌సీడబ్ల్యూ అనేక అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ వివాదానికి సంబంధించి ఏప్రిల్ 6న దర్శకుడు, కిరణ్ కుమార్ అలియాస్ ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం , గౌతమ్ కె.ఎం. కెవిఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు కూడా ఎన్‌సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. మరోవైపు నటి నోరా ఫతేహిని కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఆమె ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఆమె మరో తేదీని కేటాయించమని కమిషన్‌ను కోరారు.
కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన సినిమాలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట పెద్ద వివాదానికి దారితీసింది.ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ దుమారం చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినిమా యూనిట్‌ను ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్‌ను తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.


