దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్‌కు అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్ ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. శెల్కే తనయుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు.
జితేంద్ర శెల్కే అశోక్‌కు నమ్మిన బంటు మాత్రమే కాదు వ్యాపార భాగస్వామి కూడా. అశోక్ నిర్వహించిన ట్రస్ట్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటూ లావాదేవీలు మొత్తం చూసుకున్నాడు. అయితే లైంగిక వేధింపుల కేసు.. ఆపై అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు జితేంద్రను ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ట్రస్ట్ ఆస్తులు, భూ లావాదేవీలలో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. జితేంద్ర మరణించడం హాట్ చర్చకు దారి తీసింది.

మార్చి నెలలో మహారాష్ట్ర నాసిక్ 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ ఉదంతం వెలుగు చూసింది. పూజల పేరుతో తనపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కలకలం మొదలైంది. ఈ కేసులో మార్చి 18న అశోక్ ఖరాత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై దర్యాప్తులో సంచలన విషయం వెలుగు చూసింది.
పోలీసుల తనిఖీల్లో అశోక్ ఖరాత్‌కు సంబంధించిన డిజిటల్ పరికరాల నుంచి సుమారు 100-150 మధ్య అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్ చేసేవాడని తేలింది. ఈలోపు అందులోని కొన్ని వీడియోలు నెట్టింటకు చేరడంతో ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బాబా కామ లీలలపై జోరుగా చర్చ నడిచింది.
రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు
రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అశోక్ ఖరాత్ ప్రధానంగా దందాను సాగించినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాలతోనే.. 2018లో అప్పటి మహారాష్ట్ర సర్కారు రూ.1.05 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే ఆశ్రమానికి పలువురు ప్రముఖులు తరచూ వెళ్తుండేవాళ్లు. వాళ్లలో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చాకంకర్, ఆమె సోదరి కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఈ సెక్స్ స్కాండల్‌కు రాజకీయ మరక అంటడడంతో ఫడ్నవిస్ ప్రభుత్వం.. ఐపీఎస్ అధికారణి తేజస్వి సత్పుటే నేతృత్వంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ టీం ఖరాత్‌పై లైంగిక దాడులు, మోసం, బ్లాక్‌మెయిల్, మూఢనమ్మకాల ప్రోత్సాహం, మనీ లాండరింగ్ అభియోగాలపై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
ఈడీ సోదాలు
గడిచిన కొన్నేళ్లలో అశోక్ ఖరాత్ ఏకంగా రూ.1500 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ విచారణలో తేలింది. భారీగా భూములు, భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఆయన, బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మారుపేర్లతో మహారాష్ట్రలోని రెండు సహకార రుణ సంఘాల్లో 132 ఖాతాలు ఉన్నాయని.. గత రెండేళ్లలో ఈ ఖాతాల కింద రూ.62.74 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు సిట్ నిర్ధారించుకుంది. దీంతో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మనీ లాండరింగ్ (PMLA) కేసు నమోదు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.
ఏప్రిల్ 13వ తేదీన నాసిక్‌లో అశోక్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. తిరిగి 17, 18 తేదీల్లో తనిఖీలు జరిపి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుంది.
కోపర్గావ్ పోలీస్ స్టేషన్‌లో జితేంద్ర శెల్కే, ఆయన భార్య మరణంపై కేసు నమోదు అయ్యింది. అయితే సిట్ అనుమానాల నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీవో, ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో క్రాష్ అనాలిసిస్ చేయనున్నట్లు అహిల్యా నగర్ జిల్లా ఎస్పీ సోమనాథ్ ఘార్గే తెలిపారు.


