ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ పత్రాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.12.60 కోట్లను అప్పుగా సతీమణికి ఇచ్చినట్లు విజయ్ పేర్కొనడంపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. పెరంబూరు నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ వేసిన పిటిషన్‌లో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు.
విజయ్ తన సతీమణి సంగీతకు రూ.12.60 కోట్ల అప్పు ఇచ్చినట్లు నామినేషన్‌లో పేర్కొన్నారని, అయితే వీరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే నేపథ్యంలో, ఇంత భారీ మొత్తాన్ని అప్పుగా చూపడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన ప్రమాణపత్రాల్లో ఆస్తుల విలువలో రూ.100 కోట్ల మేర వ్యత్యాసం ఉందని, దీనిపై ఆదాయ పన్ను శాఖ విచారణ జరపాలని కోరారు.
మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ ధర్మాధికారి, న్యాయమూర్తి జస్టిస్ జి.అరుల్ మురుగన్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన మరొక పిటిషన్‌ను కోర్టు గతంలోనే పరిష్కరించినందున, మళ్లీ అలాంటి పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని న్యాయమూర్తులు తెలిపారు. ఐటీ విచారణ కోరుతూ దాఖలైన మరో అనుబంధ పిటిషన్‌పై విచారణను మాత్రం జూన్‌కు వాయిదా వేశారు.


