సాక్షి, తిరువనంతపురం: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది.
140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వేలో వెల్లడైంది.
ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఎల్‌డీఎఫ్‌కు మళ్లీ అధికారం కట్టబెట్టక పోవడం ఇక్కడ విశేషం. ఎల్‌డీఎఫ్‌కు మరోసారి అవకాశం ఇవ్వమని 42 శాతం చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్‌కు 22.3 శాతం మద్దతివ్వగా, కాంగ్రెస్ నేత సతీషన్‌కు 14.5 శాతం మద్దతిచ్చారు.
ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు.
కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ :
యూడీఎఫ్(కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలు
పినరయ్ విజయ్ కూటమి,ఎల్‌డీఎఫ్‌కి 49 నుంచి 62 స్థానాలు
బీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం
ఆత్మసాక్షి.ఎగ్జిట్‌పోల్స్
UDF 76-81
LDF 61-66
BJP 3- 4
ఇతరులు 1


