బాలిస్టిక్‌ క్షిపణి అడ్డగింతలో సక్సెస్‌ | India successfully conducted three major flight tests | Sakshi
Sakshi News home page

బాలిస్టిక్‌ క్షిపణి అడ్డగింతలో సక్సెస్‌

Jun 14 2026 4:49 AM | Updated on Jun 14 2026 4:49 AM

India successfully conducted three major flight tests

తొలిసారిగా ఈ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ

న్యూఢిల్లీ: శత్రుసైన్యం ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకునే సాంకేతికతను భారత్‌ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీంతో బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌(బీఎండీ) సామర్థ్యమున్న దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. దీంతో బీఎండీ సాంకేతికతను సాధించిన దేశాల జాబితాలో భారత్‌ చేరింది. భారతీయ యుద్ధనౌకల మీదకు దూసుకొచ్చే శత్రువుల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డగించే సాంకేతికతను పరీక్షించామని శనివారం భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులు, శత్రువుల నిఘా, పర్యవేక్షణ విమానాలను అడ్డుకునే సాంకేతికతను బీఎండీగా వ్యవహరిస్తారు. అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు మాత్రమే ఇన్నాళ్లూ ఈ సాంకేతికతను సాధించాయి.

‘‘జూన్‌ 10, 11వ తేదీల్లో పలు దశల్లో బీఎండీ టెక్నాలజీని పరీక్షించాం. ముందే షెడ్యూల్‌చేసిన లక్ష్యాలను ఛేదించేందుకు దూసుకొచి్చన బాలిస్టిక్‌ క్షిపణులను ఈ టెక్నాలజీతో అడ్డుకున్నాం’’అని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) దీనిని పరీక్షించింది. దీంతోపాటే నౌకలను నాశనంచేసే క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకునే మధ్యశ్రేణి క్షిపణి(ఎన్‌ఏఎస్‌ఎం–ఎంఆర్‌)ను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించామని రక్షణ శాఖ వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలోపు ఎత్తులో ఉన్నప్పుడు, 100 కి.మీ.ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న క్షిపణులనూ తమ బీఎండీ సాంకేతికత అడ్డుకుందని రక్షణ శాఖ తెలిపింది.

ప్రయోగాలు, పరీక్షలను డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ బలగాల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. పరీక్షలను విజయవంతం చేసినందుకు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ దళాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ‘‘శత్రు క్షిపణుల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునే ఇంటర్‌సెప్టార్లను విజయవంతంగా పరీక్షించాం. అధునాతన సాంకేతికతతో వీటిని డిజైన్‌చేసి అభివృద్ధిచేశారు’’అని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. సంక్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధిచేసి ఆచరణలో పెట్టినందుకు డీఆర్‌డీవోను మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌పెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement