వేసవి ఠారెత్తిస్తోంది. ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోతున్నాయి. హీట్ వేవ్ వార్నింగులు, జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయ్. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ చర్చోపచర్చలు కూడా సాగిపోతున్నాయ్. ఈ నేపథ్యంలో ఈ వడగాలులు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలో ఓ లుక్కేద్దాం రండి.
వడగాలులు అంటే..?
సింపుల్‌గా చెప్పాలంటే వేడి గాలులు. వాతావరణం ఎగువన (9,800–24,900 అడుగులు) ఉన్న అధిక పీడన ప్రాంతం బలపడి.. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఒక ప్రాంతంపై నిలిచి ఉన్నప్పుడు వడగాలులు ఏర్పడతాయి. 1950లలో నుంచి భూమిపై దాదాపు ప్రతి ప్రాంతంలోనూ వేడిగాలులు అంతకంతకూ పెరుగుతున్నాయ్. వాతావరణ మార్పుల వల్ల 2024 నుంచి ఇవి మరింత తీవ్రతరం అయ్యాయి. అనేక ప్రాంతాలు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను చవిచూస్తున్నాయ్.
మనపై ఎలాంటి ప్రభావం?
ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ మానవ శరీరం ఒత్తిడికి గురవుతుంది. సాధారణంగా మన శరీరం 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద చక్కగా పనిచేస్తుంది. ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత శ్వాస వేగవంతమవుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద శరీరం చల్లగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల శక్తి వినియోగం దాదాపు 35% పెరుగుతుంది. శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొంతసేపు స్థిరంగా ఉన్నప్పటికీ, ఎక్కువసేపు ఈ వేడికి గురికావడం ప్రమాదకరం. 42 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు తీవ్రమైన హానిని కలిగిస్తాయి.
అందువల్ల మన శరీర ఉష్ణోగ్రతను 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద స్థిరంగా ఉంచడానికి మన మెదడులో ఉండే హైపోథాలమస్ అనే భాగం పనిచేస్తుంటుంది. అయితే, బయట మరీ వేడి వాతావరణం ఉంటే మన శరీరం ఆ వేడిని నిరంతరాయంగా గ్రహిస్తుండటం వల్ల చల్లబరచడం కష్టమవుతుంది. మన శరీరంపై ఏర్పడిన చెమట ఆవిరయ్యే పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుంది.
పొడి వాతావరణంలో చెమట త్వరగా ఆవిరై మన శరీరంలోని అధిక వేడిని వెంటనే తొలగిస్తుంది. అదే తేమతో కూడిన రోజులలో తేమ గాలిలో నిండి ఉండటం వల్ల చెమట ఆవిరి కావడం నెమ్మదిస్తుంది. దీంతో శరీరం వేగంగా వేడెక్కడానికి, వడదెబ్బకు గురికావడానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం తన అంతర్గత వేడిని నియంత్రించుకోవడానికి అధికంగా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు గుండె, మూత్రపిండాలు అధిక ఒత్తిడికి లోనవుతాయి.
మెదడుకూ ముప్పే..
అధిక వేడి శరీరంపైనే కాకుండా నాడీ సంబంధిత ముప్పుగానూ పరిణమిస్తోంది. మెదడుపై ఇది చూపించే ప్రభావం.. మైగ్రేన్లు, మూర్చల నుంచి మానసిక రుగ్మతలు, పక్షవాతం రావడం వరకు కారణమవుతోంది. మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, దేనికైనా ప్రతిస్పందించినప్పుడు మెదడు కొంచెం వేడిని విడుదల చేస్తుంది. అప్పుడు శరీరం దానిని చల్లబరుస్తుంటుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ ప్రక్రియ ఫెయిలైతే మొత్తం శరీర వ్యవస్థ అదుపు తప్పుతుంది. వేడి వాతావరణం మనం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తుంది.
అంతేకాకుండా మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధి వంటి సమస్యలు ఉన్నవారిలో అధిక వేడి సమయంలో వడదెబ్బ, కండరాల నొప్పుల నుంచి తీవ్రమైన డీహైడ్రేషన్, వడదెబ్బ వరకు సంభవించవచ్చు, వడదెబ్బ వల్ల అధిక చెమట, నీరసం, వికారం, కండరాల నొప్పులు కలుగవచ్చు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి.. తీవ్రమైన వడదెబ్బగా మారితే.. అది గందరగోళం, మూర్ఛలు, అవయవ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. అధిక చెమట పట్టడం వల్ల నిర్జలీకరణం (డీహైడ్రేషన్), అవసరమైన లవణాల నష్టం కూడా జరగవచ్చు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది.
అత్యధిక వేడి జీర్ణవ్యవస్థ పనితీరును కూడా నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. శరీరం ప్రధాన ప్రాధాన్యం చల్లగా ఉండటమే. ఇందుకోసం చెమట ద్వారా వేడిని విడుదల చేయడానికి శరీరం చర్మానికి ఎక్కువ రక్తాన్ని పంపుతుంది. ఈ మార్పు వల్ల జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ తగ్గి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపులో భారంగా అనిపించడం, ఆకలి తగ్గడం, యాసిడ్ రిఫ్లక్స్ లేదా సాధారణ అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది. శరీరంలో తగినంత ద్రవాలు లేనప్పుడు, జీర్ణక్రియ మరింత మందగిస్తుంది, దీనివల్ల మలబద్దకం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా వృద్ధులలో, వేడి వాతావరణంలో తగినంత నీరు తాగని వారిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.
ముప్పు తప్పాలంటే ఏం చేయాలి?
సాధ్యమైనంత వరకు ఇంటి లోపలే ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12–3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దు. దాహం లేకున్నా ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. ఎండలో కష్టసాధ్యమైన పనులు చేయకూడదు. ఓఆర్‌ఎస్, లస్సీ, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉన్న, నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.
పిల్లలు, జంతువులను పార్క్ చేసి ఉన్న వాహనాల్లో వదిలిపెట్టకూడదు. ఆల్కహాల్, టీ, కాఫీ వంటివి తాగకూడదు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తడి గుడ్డతో తుడవాలి లేదా మామూలు నీళ్లను తలపై చల్లాలి. ఓఆర్‌ఎస్, నిమ్మకాయ నీళ్లు లేదా గంజి వంటి రీహైడ్రేట్ పానీయాలు అందించాలి. వెంటనే వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలి.


