ఫలితంగా భూసారం పెంపు
ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న
డీఏఓ దేవ్‌కుమార్
మెదక్ కలెక్టరేట్: వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైందని, రైతులు తప్పనిసరిగా పంటల మార్పిడి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆరుతడి పంటల సాగుతో అనేక ప్రయోజనాలు లభిస్తాయని, భూసారం పెరగడంతో పాటు పెట్టుబడులు తగ్గి అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. జిల్లాలో సరిపడా ఎరువులు ఉన్నాయని, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు వరికి బదులు మొక్కజొన్న, జొన్న, కందులు వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. ఆయిల్‌పాం సాగుకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
మార్కెట్‌లో అనేక నకిలీ విత్తనాలు వస్తున్నాయి. ఎలా గుర్తించాలి?
– చంద్రయ్య, లింగంపల్లి, పెద్దశంకరంపేట
డీఏఓ: ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఫర్టిలైజర్ షాపుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. గ్రామాల్లోకి వచ్చి తెల్లటి బస్తాల్లో విక్రయిస్తుంటారు. వాటిని కొనుగోలు చేయొద్దు. అనుమానం కలిగితే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
మాకు చదువురాదు. యాప్‌లో యూరియా బుక్ చేసుకోవడం కష్టంగా ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పండి.
– చెన్నయ్య, బొడ్మట్‌పల్లి, టేక్మాల్
డీఏఓ: ఫర్టిలైజర్ డీలర్ల వద్ద వలంటీర్లు, రైతు వేదికల వద్ద అధికారులు ఉంటారు. వారి సాయం తీసుకోవచ్చు. కొన్ని రోజులు ఇబ్బందులు ఏర్పడుతాయి. మున్ముందు మీరే చేసుకుంటారు.
నానో యూరియా వాడాలని చెబుతున్నారు. వాటి గురించి అవగాహన లేక ఇబ్బంది పడుతున్నాం. – నరేందర్‌రెడ్డి, పాపన్నపేట
డీఏఓ: ఎకరా వరికి ఒక యూరియా బస్తా బదులు 250 మిల్లిలీటర్ల నానో యూరియా సరిపోతుంది. దీని వాడకంపై ఇప్పటికే అన్ని గ్రా మాల్లో అవగాహన రైతులకు అవగాహన కల్పించాం. అవసరమైతే మరోసారి వివరిస్తాం.
జీలుగ విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలి?
– జోడు రవీందర్, పెద్దశంకరంపేట
డీఏఓ: వరి నాటు వేసుకునే 45 రోజుల ముందు జీలుగ విత్తనాలు వేసుకోవాలని. ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నాలి.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందా? ఎలాంటి పంటలు వేసుకోవాలి?
– భిక్షపతి, చిట్టోజిపల్లి, చేగుంట
డీఏఓ: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే నష్టం ఉండదు.
పీఏసీఎస్‌లో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు.
– రాజు, ఎదుల్లాపూర్, శివ్వంపేట
డీఏఓ: అధిక ధరలకు ఎరువులు ఎవరు విక్రయిస్తే సహించేది లేదు. బ్యాగులపై ఉన్న ధరలు పరిశీలించండి. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల గురించి తెలపండి.
– ప్రభుదాస్, దేవులపల్లి, కౌడిపల్లి
డీఏఓ: రెగ్యులర్‌గా వరి వేయడంతో భూసారంతో పాటు పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి మొక్కజొన్న, పత్తి, జొన్న, కందులు, పెసర్లు వంటివి సాగు చేసుకోవచ్చు.
మొక్కజొన్నకు అధికంగా కత్తెర పురుగు ఆశిస్తుంది. ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి.
– ధరప్ప, అచ్చన్నపల్లి, టేక్మాల్
డీఏఓ: స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించండి. ఆయన సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది.
యూరియా యాప్ ఓపెన్ కావడం లేదు, ఒకసారి అయితే, మరోసారి బుక్ కావడం లేదు.
– యాదగిరి, శివ్వంపేట.
డీఏఓ: ప్రస్తుతం యూరియా యాప్ ఓపెన్‌లో ఉంది. అయితే ఒకసారి బుక్ చేసిన తర్వాత తిరిగి 12 రోజులకు మాత్రమే బుక్ అవుతుంది.
పీఏసీఎస్‌లో విత్తనాలు అందుబాటులో లేవు. వానాకాలం వరి విత్తనాలు నాటుకోవాలి.
– నరేందర్‌రెడ్డి, ఉసిరికపల్లి, శివ్వంపేట
డీఏఓ: జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పీఏసీఎస్ కుడా వస్తాయి. ప్రస్తుతం కూనారం సన్నాలు 1638, 777, తెలంగాణ సోన, జైశ్రీరాం, బీపీటీ వంటి విత్తనాలు వేసుకోవచ్చు.
ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాం
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్
‘సాక్షి’ ఫోన్ ఇన్‌కు అనుహ్య స్పందన


