ఆ ఆట.. మృత్యు వేట! | - | Sakshi
Sakshi News home page

ఆ ఆట.. మృత్యు వేట!

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ఇద్దరు పిల్లలను సాగర్‌లో తోసేసి తానూ ఆత్మహత్మ

ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయి..

ఇద్దరు పిల్లలను సాగర్‌లో తోసేసి తానూ ఆత్మహత్మ

అభం, శుభం తెలీని ఆ చిన్నారులు నాన్న ఆడిస్తానంటే నమ్మి వెళ్లారు. బిర్యానీ తీసుకొస్తే సంతోషంగా తిన్నారు.. తమతో పాటే ప్రాజెక్టు నీటిలో సంతోషంగా ఆడిస్తుంటే కేరింతలు కొడుతూ మైమరిచి ఆడారు. ఆట సంబురం తీరిందనుకొనేలోపే తండ్రే కాలయముడిలా మారి కన్న బిడ్డలను నీటిలో తోసేసి తానూ తనువు చాలించాడు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కృష్ణ తన ఇద్దరు పిల్లలను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో తోసేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలచి వేసింది.

నారాయణఖేడ్‌: నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గూల కృష్ణ (34) ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన సవితతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రక్షిత్‌ (8), అణన్య (6) ఇద్దరు సంతానం. నిజాంపేటలో చేపలు పట్టే జీవనం సాగించేవాడు. స్థానికంగా ఉపాధి ఇబ్బంది కరంగా మారడంతో కొన్ని నెలల క్రితం పటాన్‌చెరుకు వలస వెళ్లాడు. కృష్ణ పేయింటర్‌గా పనిచేస్తుండగా.. సవిత ఇడ్లీ సెంటర్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

గొడవలతో పుట్టింటికి..

ద్యానికి బానిసైన కృష్ణకు బయట అప్పులు చేసిన విషయాన్ని పలుమార్లు భార్య ప్రశ్నించింది. ఎక్కడెక్కడ అప్పులు చేశావంటూ అడగడంతో తాను తనకోసం అప్పులు చేసుకున్నాను, నా బాధ నేను పడతానంటూ భార్యతో గొడవ పడేవాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల జరిగే గొడవలతో సవిత తన ఇద్దరు పిల్లలను తీసుకొని దేవునిపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. తాను బాగుంటానని చెప్పి భార్య, పిల్లలను నెల క్రితం తీసుకొని పటాన్‌చెరుకు వచ్చాడు.

జాగ్రత్త.. బైబై

నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో పిల్లలను ఆడిస్తూ సెల్ఫీ ఫొటోలు తీశాడు కృష్ణ. అనంతరం వాటిని అన్నారం గ్రామానికి చెందిన బావమరిది ఫోన్‌కు సెండ్‌ చేశాడు. జాగ్రత్త, బాయ్‌ బాయ్‌.. మంచిగ ఉండండి అంటూ చివరి వాయిస్‌ మెస్సేజ్‌ పెట్టాడు. దీంతో కంగారు పడిన బావమరిది తిరిగి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. విషయం కుటుంబీకులకు తెలపడం వారు చేరుకొని రాత్రి గాలించినా మృతదేహాలు లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం మృతదేహాలను వెలికి తీశారు.

చెప్పా పెట్టకుండా వెళ్లి..

రచూ ఇంట్లో గొడవలు జరిగే సమయాల్లో పిల్లలను తీసుకొని వెళ్లి రాత్రి 11లోపు ఇంటికి చేరుకునే వాడు. గురువారం ఉదయం 9.40గంటల ప్రాంతంలో పిల్లలను తీసుకొని వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి చేరుకోలేదు. భార్య ఫోన్‌ చేస్తే స్పందించలేదు. నిజాంపేటకు వచ్చిన కృష్ణ.. బైక్‌ తీసుకొని నిజాంసాగర్‌కు చేరుకున్నాడు. పిల్లలకు ఆహారం కొనిచ్చి తినిపించాడు. కొద్దిసేపు నీటిలో ఆడించాడు. చేపలు పట్టేందుకు వాడే తెప్పపై పిల్లలను కూర్చోబెట్టుకొని నీరు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి వెళ్లి ఆడించి వారిని నీటిలో తోసేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఘటనా స్థలిలో కుటుంబీకుల రోదనలు

కృష్ణ చదువులో మంచి టాపర్‌గా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఒక్క మార్కు తేడాతో కానిస్టేబుల్‌ ఉద్యోగం కోల్పోయాడని పేర్కొన్నారు. నిజాంపేట్‌లో బాగానే ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో పటాన్‌చెరువు వెళ్లాకనే కలహాలు ప్రారంభం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

అభం శుభం తెలీని పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి

ఆర్థిక ఇబ్బందులతోకుటుంబ కలహాలు

జాగ్రత్త బైబై అంటూ చివరి మెస్సేజ్‌

నిజాంపేటలో విషాదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement