నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి పద్మ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా త్వరితగతిన రైస్‌మిల్‌కు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలస్యం చేయకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని కేంద్రం ఇన్‌చార్జి స్వామికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పెద్దశంకరంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: మండల పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో వానాకాలం మెయింటనెన్స్ ప్లాన్‌లో భాగంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ తెలిపారు. బూర్గుపల్లి, జంబికుంట, రామోజీపల్లి, పెద్దశంకరంపేట ఫీడర్ల పరిధిలో విద్యుత్ కోత ఉంటుందన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండలంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో మరమ్మతుల కారణంగా శని, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ దినకర్ తెలిపారు.
నర్సాపూర్: ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వినియోగం తగ్గించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఆఫీసర్ కుమార్ పాటక్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నియంత్రణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వ్యాపా రులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 120 మైక్రాన్స్ కలి గిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడాలని, అంతకన్న తక్కువ మైక్రాన్స్ కలిగిన బ్యాగులు వాడొద్దని హితవు పలికారు. అనంతరం ప్లాస్టి క్‌తో పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. కమిషనర్ సాయికుమార్ మాట్లాడుతూ.. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఎవరూ వాడొద్దని, వాడి తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. సమావేశంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట శివారులోని ఓ రసాయన పరిశ్రమను డీఎల్‌పీఓ సురేశ్‌బాబు శుక్రవారం పరిశీలించారు. వ్యర్థాలను తరలించేందకు చేపట్టిన చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 100 కేజీలకు ఎక్కువగా నిత్యం వ్యర్థ పదార్థాలను బయటకు తరలించే పరిశ్రమలు ఆన్‌లైన్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న బ్లాక్‌లకు అవసరమైన అనుమతులను తీసుకోవడంతో పాటు జీపీకి సెస్ చెల్లించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ దామోదర్, సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. అలాగే మండలంలోని ప్యాటగడ్డ పంచాయతీ పరిధిలో మురికి కాలువలను పరిశీలించి సర్పంచ్ లావణ్యకు పలు సూచనలు చేశారు.
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రధానిగా నరేంద్ర మోదీ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మండలంలోని తునికి కేవీకేలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ నిర్వహిస్తామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం కేవీకేలో ఏర్పాట్లను పరిశీలించి శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందర్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరవుతారని తెలిపారు.


