ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ కలెక్టరేట్: పెండింగ్ కేసుల దర్యాప్తు ముమ్మరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించి, దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యం లేకుండా సమయపాలనతో విధులు నిర్వర్తించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఎస్పీ వెంట టౌన్ సీఐ మహేశ్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


