ఎరువు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఎరువు దోపిడీ

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

ఎరువు దోపిడీ చర్యలు చేపట్టాలి

ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు

ఒక్కో బస్తాపై రూ.200 వరకు అదనంగా వసూలు

● పాత స్టాక్‌ను పెరిగిన ధరలతో విక్రయాలు

● ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే షురూ

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే అన్నదాతలను దోపిడీ చేయడం షురూవైంది. కొందరు వ్యాపారులు, డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ (గరిష్ట చిల్లర ధర) కంటే ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఎమ్మార్పీ కంటే సుమారు రూ. 200 వరకు అధికంగా వసూలు చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.

– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

ప్రధానంగా పత్తి సాగు చేసే రైతులు విత్తనాలతో పాటు పంటకు బలాన్ని ఇచ్చే 20:20 ఎరువును కూడా వేస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని 20: 20 ఎరువుల బస్తాను డీలర్లు కొందరు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఎరువును 1,500 బస్తా చొప్పున అమ్మాలి. కానీ ఒక్కో బస్తాపై రూ.1700 వరకు విక్రయిస్తున్నారు. ఎవరైనా రైతులు ఇదేమని ప్రశ్నిస్తే అసలు స్టాక్‌ లేదంటూ బుకాయిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక డీలర్లు చెప్పిన ధరకే ఎరువును కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

స్టాక్‌ లేదంటూ.. దాటవేత

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న డీలర్లు రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఎవరైన రైతులు ఎరువులకు సంబంధించిన బిల్లులు అడిగితే అసలు స్టాకే లేదంటూ బుకాయిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక బిల్లులు లేకుండా డీలర్లు చెప్పిన ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది.

ధరలు పెరుగుతున్నాయంటూ..

కొందరు వ్యాపారులు వారం రోజుల్లో ఎరువుల ధరలు పెరుగుతాయంటూ కూడా రైతులను మభ్య పెడుతున్నారు. అయితే కొన్ని ఎరువుల ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం పాత స్టాక్‌ను బస్తాపై ఉన్న ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలి. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీలు లేదు. అయితే చాలా మంది డీలర్ల వద్ద పాత స్టాక్‌ ఉంది. ఈ స్టాక్‌ మొత్తాన్ని పాత ధరలకే విక్రయించాలి. కానీ ఈ పాత స్టాక్‌ను కొందరు డీలర్లు పెరిగిన కొత్త స్టాక్‌ ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించే డీలర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల వ్యాపారులు పాత స్టాక్‌ను కొత్త ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలి.

– టి.పృథ్విరాజ్‌, రైతు సంఘం నాయకుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement