మెదక్‌జోన్: పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నెలవారీ క్రైం రివ్యూ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా నమోదైన నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, మిస్సింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, సుభాశ్ చంద్రబోస్, సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రేణుకారెడ్డి, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేగుంట(తూప్రాన్): సర్వ శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చేగుంటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించిందన్నారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు సైతం అందించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని పైతర, రంగంపేట, చిన్నఘనాపూర్, అంసాన్‌పల్లి విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్టు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, వేలాడుతున్న తీగలను సరిచేసేందుకు కరెంట్ నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం
హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జూన్ 15వ తేదీ లోగా వివిధ డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.


