నర్సాపూర్: మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మరుగున పడింది. గడువు దాటినా పాలకమండలి ఆ ఊసే ఎత్తడం లేదు. నాలుగు కోఆప్షన్ పదవుల కోసం ఏప్రిల్‌లో మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ణయించారు. దీంతో పట్టణానికి చెందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులతో పాటు స్వచ్ఛందంగా కోఆప్షన్ పదవిని ఆశిస్తున్న వారు మొత్తం 36 మంది దరఖాస్తు చేశారు. అయినా ఇప్పటివరకు ఎన్నిక నిర్వహించలేదు. ఇదిలా ఉండగా చట్టం ప్రకారం దరఖాస్తు చేసే చివరి తేదీ నుంచి 15 రోజుల్లో పాలకమండలి కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుందని తెలిసింది. అయితే గడువు ముగిసి 45 రోజులు కావొస్తున్నా ఇంకా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం పాలకమండలి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. నింబధనల మేరకు కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియను పాలకమండలి చేపట్టకపోయినా, జిల్లా అధికార యంత్రం ఎంపిక ప్రక్రియ చేపట్టే విధంగా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని పలువురు అభ్యర్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసిన వారిలో నలుగురిని ఎంపిక చేయాలని కోరుతున్నారు. అయితే గత పాలకమండలి హయాంలో సైతం కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేయకుండానే ఐదేళ్ల పరిపాలన కాలం ముగిసిపోయింది. అప్పట్లో కోఆప్షన్ పదవిని ఆశించిన పలువురు నాయకుల ఆశలు ఆవిరయ్యాయి. ఈసారైనా సకాలంలో నిర్ణయం తీసుకొని కోఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని ఆశావహులు కోరుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి వివరణ కోరగా, పలు కారణాలతో కోఆప్షన్ సభ్యుల ఎంపిక చేయలేకపోయామని తెలిపారు. వీలైనంత త్వరలోనే పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఏప్రిల్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ
గడువు ముగిసి 45 రోజులు
పట్టించుకోని పాలకమండలి


