మహిళా పథం | - | Sakshi
Sakshi News home page

మహిళా పథం

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

ప్రగతిరథం..

రూ.21.96కోట్లతో 61 బస్సులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మహిళా సమాఖ్యలకు అందజేత

సాక్షి, సిద్దిపేట: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన మహిళా సమాఖ్యలకు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి రూ.21.96కోట్లతో 61 బస్సులు అందజేశారు. మెదక్‌కు 20, సిద్దిపేటకు 23, సంగారెడ్డికి 25 బస్సులున్నాయి. ఒక్కో బస్సు రూ. 36లక్షల వ్యయంతో కొనుగోలు చేశారు. ఇందులో ప్రభుత్వం కార్పస్‌ఫండ్‌ కింద రూ.30లక్షలు మంజూరు చేయగా మిగిలిన రూ.6లక్షలు మండల సమాఖ్య నుంచి చెల్లించారు. 61 బస్సుల కోసం సమాఖ్య వాటాగా రూ.3.66కోట్లు చెల్లించగా, కార్పస్‌ ఫండ్‌ కింద ప్రభుత్వం రూ.18.30కోట్లు అందజేసింది. మండల సమాఖ్యల నుంచి వచ్చే బస్సుల్లో సింహభాగం పల్లె వెలుగులు, కొన్ని ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.

వ్యాపార రంగాల్లోనూ..

పొదుపు నుంచి మహిళలు వ్యాపార రంగాల్లో సైతం రాణిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమల స్థాపనతో ఉపాధి పొందుతున్నారు. అతివలకు రెట్టింపు ఆదా యం పెంచేందుకు మహిళా శక్తి క్యాంటీన్‌, పెరటికోళ్ల పెంపకం, పాడి గేదెలు ఇలా వివిధ రంగాల్లో పురోగతిచెందుతున్నారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. నెలకు రూ.69వేల బస్సు అద్దెను ఆర్టీసీ యాజమాన్యం చెల్లించనుంది. దీంతో మహిళా సమాఖ్యకు మరింత ఆదాయం పెరగనుంది. నూతనంగా ఏర్పాటైన మండలాల్లో సైతం మండల సమాఖ్యలు ఏర్పాటు చేయాలని, వాటికి బస్సులు అందజేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement