గడువులోగా పూర్తి చేయిస్తా
● కొనసాగుతున్న స్కూల్ నిర్మాణ పనులు
● అంతర్జాతీయ హంగులతో గదులు
రామాయంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కూల్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జిల్లాలోని రామాయంపేటలో 25 ఎకరాలు.. రూ.200 కోట్లకు పైగా భారీ నిధులు వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడువులోగా నిర్మాణం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ పనులు స్పీడప్ చేశారు.
గుట్టలను తొలచి.. చదును చేసి
జాతీయ రహదారిని అనుకొని ఉన్న స్థలంలో చదును కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. గుట్టలను తొలచి.. బండరాళ్లను తొలగించి నిర్మాణ పనులు ప్రారంభించారు. స్థలం చదును కోసమే సుమారు నెలరోజులు శ్రమించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు అన్నివర్గాలకు చెందిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించనున్నారు. మొత్తం 25 వందలకు పైగా విద్యార్థులను ఈ స్కూల్‌లో చేర్చుకుంటారు. వీరికి విద్యాబుద్ధులతో పాటు ఆటలు, కంప్యూటర్ శిక్షణ కోసం మొత్తం 180 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని నియమిస్తారని తెలిసింది. స్కూల్ తరగతులతో పాటు హాస్టళ్లు, కంప్యూటర్ల గదులు, ఆడిటోరియం, అవుట్‌డోర్, ఇండోర్ గేమ్స్, క్రీడా మైదానాలు, గ్రంథాలయాలకు సంబంధించి వేర్వేరుగా భవనాలు నిర్మించనున్నారు.
డిజిటల్ తరగతులు
అన్ని తరగతి గదుల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన అందించనున్నారు. ఈ మేరకు తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డులు, అధునాతన సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజటల్ లైబర్రీని నెలకొల్పుతారు. అలాగే అల్ట్రా మోడ్రన్ డార్మెటరీలు నిర్మిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేకంగా జీ ప్లస్ వన్ పద్ధతిలో భవనాలు నిర్మిస్తున్నారు.
జిల్లాలోని రామాయంపేటకు మొదటి విడతలోనే ఇంట్రిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించాను. ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు సైతం కేటాయించింది. గడువులోగా పాఠశాల నిర్మాణం పూర్తి చేయించేలా కృషి చేస్తా.
– మైనంపల్లి రోహిత్, మెదక్ ఎమ్మెల్యే


