నత్తే నయం | - | Sakshi
Sakshi News home page

నత్తే నయం

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

జోరు తగ్గిన సింగూరు రివీట్‌మెంట్‌ మరమ్మతులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు, ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సాగు నీరు అందించే సింగూరు ప్రాజెక్టు ఆనకట్ట రివీట్‌మెంట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా వేగం పుంజుకోవడం లేదు. ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైనా పనుల్లో పురోగతి కనిపించకపోవడం లేదు. వర్షాలు ఊపందుకుని ప్రాజెక్టు నిండితే పనులు చేయడానికి అసలే వీలు పడదు. ఈ ఆరు నెలల్లో కనీసం పది శాతం పనులైనా పూర్తికాకపోవడంతో ఈ ప్రాజెక్టు మరమ్మతు పనులు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు రివీట్‌మెంట్‌ పూర్తిగా దెబ్బతిన్నదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిన విషయం విదితమే. దీన్ని వెంటనే మరమ్మతు చేయకపోతే ప్రాజెక్టు తెగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని ఈ అథారిటీ హెచ్చరించింది. ఈ హెచ్చరికల మేరకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రివీట్‌మెంట్‌ పనులను దాదాపు ఆరు నెలల క్రితం ప్రారంభించింది. ఆనకట్టకు చివరివైపు నుంచి రివీట్‌మెంట్‌ పనులు ప్రారంభించారు. ఈ పనులు ఆశించిన మేరకు వేగంగా సాగకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

బిల్లులు రావడం లేదని..

పనులు వేగం పుంజుకోకపోవడానికి బిల్లులు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేసిన పనులకు ఆ మేరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టరు పనుల వేగాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నుంచి వెంటవెంటనే బిల్లులు మంజూరైతే వీలైనంత త్వరగా ఈ పనులు చేసేందుకు వీలుంటుంది. కానీ, ఇలాంటి అత్యవసర పనులకు కూడా బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో కాంట్రాక్టరు పనులు పూర్తి చేయడంలో ఉత్సాహం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.16.5 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన పనులు

సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనుల్లో జాప్యం

ముంచుకొచ్చిన వానాకాలం

రూ.ఐదు కోట్లలోపే పనులు

రివీట్‌మెంట్‌ పనులకు సుమారు రూ.16.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. అయితే ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల మేరకు కూడా పనులు పూర్తికాలేదని సమాచారం. ఇంకా సుమారు రూ.11.5 కోట్ల మేరకు పనులు జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ప్రారంభం కావడంతో ఈ పనులకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ పనులు చివరి దశకు చేరుకుని ఉంటే వర్షాలు ఊపందుకుని ప్రాజెక్టు నింపేందుకు వీలు కలిగేఅవకాశముండేది. కానీ, ఆశించిన మేరకు పనులు జరగకపోవడంతో ఈ వర్షాకాలంలో ప్రాజెక్టును నింపడం ప్రశ్నార్థకంగా తయారైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement