ఒకటినే వేతనం! | - | Sakshi
Sakshi News home page

ఒకటినే వేతనం!

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

మల్టీపర్పస్‌ వర్కర్లకు మంచి రోజులు

సీఎం ప్రకటనపై కార్మికుల హర్షం

జిల్లావ్యాప్తంగా 1,692 మందికి మేలు

మెదక్‌జోన్‌: మల్టీపర్పస్‌ వర్కర్లకు మంచి రోజులొచ్చాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగుల మా దిరిగానే ప్రతీ నెల 1వ తేదీనే వేతనం చేతికందనుంది. ఇదే విషయం సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలలకోసారి జీతా లు రావడంతో కుటుంబాలు గడవక పడరాని పాట్లు పడ్డారు.

జిల్లావ్యాప్తంగా 492 పంచాయతీలు ఉండగా, 1,692 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ప్రతి 500 మంది జనాభాకు ఒకరు చొప్పున గత ప్రభుత్వం వీరిని నియమించింది. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి ప్రతి నెలా రూ. 9,500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా, వీరు చెత్తను సేకరించటం, మురికి కాలువలను శుభ్రం చేయటం, తాగునీటి మోటార్లు నడిపించి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయటం, గ్రామాల్లోని పాఠశాలలతో పాటు రోడ్లను శుభ్రం చేయటం, రోడ్ల వెంట నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరు పట్టడం.. నిత్యం వీరు నిర్వహించే విధులు. గడియ తీరిక లేకుండా పనులు చేస్తున్నా వీరికి నెలకు రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. అంటే రోజుకు రూ.316 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రెండు, మూడు నెలలకోసారి అందజేస్తున్నారు. దీంతో పండుగలు, ఇతర శుభకార్యాలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కార్మికులకు ప్రతీనెల వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించటంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ నిధుల నుంచే చెల్లింపు

కార్మికులకు ప్రతీ నెల ఒకటిన వారి అకౌంట్లలో వేతనాలు జమ చేయాలని ప్రభుత్వం నుంచి గతంలో ఆదేశాలు రావడంతో అధికారులు మల్టీపర్పస్‌ వర్కర్ల బ్యాంకు ఖాతాలను తీసుకొని ఆన్‌లైన్‌ చేశారు. అయితే వివిధ కారణాలు చూపుతూ ఆర్థికశాఖ కార్మికుల అకౌంట్లలో జీతం వేయటం కుదరదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో పంచాయతీ నిధుల్లో జమ అయిన డబ్బులను డ్రా చేసి కార్మికులకు ఇచ్చే బాధ్యత కార్యదర్శులకు అప్పగించినట్లు సమాచారం. కాగా, మే నెలకు సంబంధించి విధులు నిర్వర్తించిన కార్మికుల వివరాలను పంచాయతీరాజ్‌శాఖకు ఆర్థికశాఖ అధికారులు పంపించారు. దీంతో ఈనెల నుంచే కార్మికులకు ప్రతీ నెల వేతనాలు రానున్నాయి. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement