అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్
వెల్దుర్తి(తూప్రాన్): రహదారి భద్రత అందరి బాధ్యతని అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు. మాసాయిపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో దేశ రక్షణలో కంటే రోడ్డు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడిన వారే ఎక్కువగా ఉంటున్నారని వాపోయారు. రహదారుల భద్రత ప్రతి పౌరుడి బాధ్యతన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణ పక్కాగా జరగాలని సూచించారు. ఈసందర్భంగా పంచాయతీ కార్యాలయం నుంచి ఉన్నత పాఠశాల ఆవరణ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు హెల్మెట్‌తో పాటు సీటుబెల్ట్ తప్పకుండా ధరించాలని పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన తీర్మాన ప్రతిని పాలకవర్గ సభ్యులు అధికారులకు అందజేశారు. అలాగే మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సర్పంచ్ కిష్టారెడ్డి, డీపీఓ యాదయ్య, జిల్లా రవా ణ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, తూప్రాన్ ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, రామాయంపేట సర్కిల్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


