హుస్సేన్‌ కుటుంబానికి న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌ కుటుంబానికి న్యాయం చేయాలి

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

సర్‌ సమీక్షలో సచివాలయాల

ఉద్యోగుల ఆందోళన

అధికారులను చుట్టుముట్టి నిరసన

కర్నూలు (టౌన్‌): అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న హుస్సేన్‌ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆనంద్‌కుమార్‌, శివ ప్రసాద్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్‌ హాలులో సర్‌ సర్వేపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగరపాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు, అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ. కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌ కుమార్‌ రెడ్డి, ఎన్నికల తహసీల్దార్లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే సచివాలయాల వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ హుస్సేన్‌ అమర్‌ హై.. అంటూ నినాదాలు చేశారు. ఆయనకు మద్దతుగా అన్ని విభాగాల సచివాలయాల ఉద్యోగులు మద్దతు పలకడంతో సమావేశంలో ఉద్రిక్తతత చోటు చేసుకుంది. సచివాలయాల ఉద్యోగులంతా పోడియం వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం సర్‌ సర్వేలో 14 డిపార్టుమెంట్లకు సంబంధించిన ఉద్యోగులను వినియోగించుకోవాలని ఉందన్నారు. సచివాలయాల ఉద్యోగులు 18వ స్థానంలో ఉన్న తమపై ఒత్తిడి చేయడం తగదన్నారు. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో పని చేయాలంటూ ఒత్తిడి చేయడం మానుకోవాలని, టెలికాన్ఫరెన్స్‌ల పేరుతో వేధించడం, డెడ్‌లైన్‌ విధించడం వంటివి ఆపాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హుస్సేన్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో 10 రోజుల వ్యవధిలో మృతుని కుటుంబానికి టిడ్కో గృహం మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. అలాగే సచివాలయాల ఉద్యోగులు అడిగిన డిమాండ్లను పరిశీలిస్తామని, ఒత్తిడి లేకుండా పని చేయించుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాగా సర్‌పై నిర్వహించే సమావేశంలో వాగ్వావాదం, గొడవలు జరిగే అవకాశం ఉంటుందన్న సమాచారంతో పోలీసులు ముందుగానే అక్కడ పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement