అన్‌ ఫిట్‌.. రయ్‌ రయ్‌ ! | - | Sakshi
Sakshi News home page

అన్‌ ఫిట్‌.. రయ్‌ రయ్‌ !

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

అన్‌ ఫిట్‌.. రయ్‌ రయ్‌ !

ఆందోళన కలిగిస్తున్న స్కూల్‌ బస్సులు 84.61 శాతం బస్సులకు ఇంకా ఫిట్‌నెస్‌ పరీక్షలు పెండింగ్‌ రెండు నెలల సెలవులు ఉన్నా సిద్ధం కాని బస్సులు విద్యార్థుల భద్రతను గాలికొదిలిన విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు

జిల్లా సమాచారం

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు ఈ నెల 12వ తేదీ నుంచి పునఃప్రారంభమయ్యాయి. కొత్త దుస్తులు, పుస్తకాలు, బూట్లతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్తుండగా, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ టెస్టుకు సన్నద్ధం కాలేదు. విద్యా సంస్థలు విద్యార్థుల భద్రతతో చెలగాటం అడ్డుతున్నాయి. వేసవి సెలవులకు దాదాపు రెండు నెలల సమయం లభించినప్పటికీ, అనేక పాఠశాలలు, కళాశాలల బస్సులు ఇప్పటికీ ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు పొందకుండానే రోడ్లపైకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

నిబంధనలకు తూట్లు..

కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు అనుభవంలేని డ్రైవర్లతో పాటు పదవీ విరమణ పొందిన డ్రైవర్లను కూడా బస్సులు నడిపేందుకు నియమిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ వేతనాలతో డ్రైవర్లను నియమించుకోవచ్చనే ఉద్దేశంతో నిబంధనలను గాలికొదిలేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగిన సందర్భాలు గుర్తు చేసుకోవాలి.

కాలం చెల్లిన బస్సులకూ ఫిట్‌నెస్‌ ?

ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు రవాణాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల కాలం చెల్లిన బస్సులకు రంగులు వేసి రోడ్లపై తిప్పుతున్నారు. అలాంటి బస్సులు రవాణా శాఖ లెక్కల్లోనే ఉండవు. ఉన్న వాటిల్లో ఒకటి రెండు బస్సులకు ఫిట్‌ నెస్‌ తీసుకుని వాటిని తిప్పుతూ అవసరం వచ్చినప్పుడు కాలం చెల్లిన బస్సులను బయటకు తీసి వాటిలోనే విద్యార్థులను తరలిస్తున్నారు.

ఏటీఎస్‌లలో అక్రమ వసూళ్లు..

ఇటీవల రవాణాశాఖ అధికారులు తనిఖీలు కఠినతరం చేసినప్పటికీ, ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ (ఏటీఎస్‌) వద్ద అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల్లో లోపాలు ఉన్నప్పటికీ ఏటీఎస్‌ అధికారిక ఫీజులకు అదనంగా వసూళ్లు చేసి ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. అదనపు మొత్తాలు చెల్లించని వాహనాలను రిజెక్ట్‌ చేసి, మరమ్మతులు చేయించుకుని రావాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. రెండోసారి పరీక్షలకు వస్తే సమయం, డబ్బు వథా అవుతుందనే ఉద్దేశంతో అడిగినంత చెల్లించి ఫిట్‌నెస్‌ పొందుతున్నామని వాహన యజమానులు వాపోతున్నారు. అధిక వసూళ్ల కారణంగా విద్యా సంస్థలు బస్సులను ఫిట్‌నెస్‌ టెస్టుకు పంపించకుండా కాలం వెలిబుచ్చుతున్నారని తెలుస్తుంది.

చేతులెత్తేసిన రవాణాశాఖ..

వాహనాల ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లను (ఏటీఎస్‌లు) చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. భద్రత అంశాన్ని రవాణాశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నుంచి దూరం చేసి, ప్రైవేట్‌ యాజమాన్యాలపై ఆధారపడే పరిస్థితిని తీసుకొచ్చింది. దీంతో ఫిట్‌నెస్‌ ప్రక్రియలో ఏటీఎస్‌ లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, రవాణాశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

మొత్తం విద్యాసంస్థలు – 194

పాఠశాలల బస్సులు – 773

తనిఖీ చేసిన బస్సులు – 261

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందినవి – 119

లోపాలు గుర్తించిన బస్సులు – 142

ఫిట్‌నెస్‌ టెస్ట్‌లకు రావాల్సినవి – 654

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement