జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
పెనుగంచిప్రోలు: ప్రతి మనిషి బాగుండాలనేదే కమ్యూనిజం సిద్ధాతమని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక మునేరు అవతల స్నేహ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయి రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పోలీస్‌స్టేషన్ సెంటర్ నుంచి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఎక్కడా బలహీనపడలేదని, ప్రతి శ్రామిక వర్గానికి వెన్నుదన్నగా నిలబడుతూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతుందన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి సమస్యల పరిష్కారంలో ఉంటున్నామన్నారు. శ్రామికుడికి అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమే అన్నారు. అనంతరం సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, గడ్డం కోటేశ్వరరావులు రచించిన కృష్ణా –గోదావరి గ్యాస్ మన హక్కు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్, జాతీయ సమితి కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జి.కొండూరు: ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటనలో విస్సన్నపేట మండల పరిధి తాతకుంట్లలో వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్లితే తాతకుంట్ల గ్రామానికి చెందిన వీరమాచినేని నరేష్(50)తో పాటు ఐదుగురు వ్యక్తులు రెడ్డిగూడెం మండల పరిధి ముచ్చినపల్లి గ్రామంలో ఈనెల 12వ తేదీ సాయంత్రం చిత్తులాట ఆడుతుండగా రెడ్డిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఆరుగురిపై కేసు నమోదు చేసి విడుదల చేశారు. నరేష్ తాతకుంట్లలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత రోజు 13వ తేదీన ఉదయం ఏడు గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. నరేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులు చిత్ర హింసలు పెట్టడం వల్ల, కంటికి కన్పించని దెబ్బలతో తీవ్రమానసిక క్షోభకు గురై మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు, కాళ్లపై బెల్టులు తెగిపోయేలా కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, ఎంత బతిమాలిన వినకుండా పక్కటెముకులపై దాడిచేశారని ఆరోపించారు. నరేష్ మృతికి కారణమైన పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం రెడ్డిగూడెం ఎస్‌ఐ ఎస్.శ్రీనును సస్పెండ్ చేయాలంటూ విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ వరకు కూడా వెళ్లారు. ఇంతలో అధికార పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం చేయడంతో ఫిర్యాదు చేయకుండా వెనక్కి వచ్చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒక కుమారుడు చదువు నిమిత్తం విదేశాల్లో ఉండటంతో అతని వచ్చే వరకు వేసి ఉండి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించడంతో వివాదం ముగిసింది.


