ఉయ్యూరులో ఘరానా మోసం | - | Sakshi
Sakshi News home page

ఉయ్యూరులో ఘరానా మోసం

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

దళారులతో చేయి కలిపిన స్మాల్‌ ఫైనాన్స్‌ సంస్థ ఇంటి యజమానికి తెలియకుండా ఇంటిపై రుణం మంజూరు ఆపై వాయిదా చెల్లించడం లేదంటూ ఇల్లు జప్తు చేస్తామని బెదిరింపు

ఉయ్యూరు: దళారులతో చేయి కలిపిన ఓ స్మాల్‌ ఫైనాన్స్‌ సంస్థ.. ఓ ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ ఇంటిపై రుణం మంజూరు చేసేసింది. ఆపై వాయిదాలు చెల్లించడం లేదంటూ ఆ ఇంటిని జప్తు చేసేందుకు పన్నాగం పన్నింది. ఉయ్యూరులోని కణుపూరి అగ్రహారంలో వి.లీలాకుమారికి సొంత ఇల్లు ఉంది. గుడివాడకు చెందిన ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ సంస్థ సిబ్బంది ఇటీవల ఆమె దగ్గరకు వచ్చి ఇంటిపై రూ.10 లక్షల రుణం ఉందని, వడుగు వెంకటేశ్వరరావు రుణం తీసుకుని ఒక్క వాయిదా కూడా చెల్లించనందున ఇంటిని జప్తు చేస్తామని చెప్పారు. అయితే ఆ రుణం తాను తీసుకోలేదని లీలాకుమారి తేల్చి చెప్పారు.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి..

దీంతో ఆమె ఇంటి వద్ద ఆమె కొడుకు గోపిచంద్‌తో వడుగు వెంకటేశ్వరరావు, ఉయ్యూరుకు చెందిన కోరాడ సతీష్‌బాబు దిగిన ఫొటోను ఫైనాన్స్‌ సంస్థ సిబ్బంది ఆమెకు చూపించారు. ఆమె వెంటనే ఫొటో ఎందుకు దిగావంటూ తన కొడుకును ప్రశ్నించగా.. తాను అయ్యప్ప మాల ధరించగా సతీష్‌, మరో ఇద్దరిని వెంట పెట్టుకుని తన వద్దకు వచ్చాడని, తాను కూడా అయ్యప్ప మాలధరిస్తానని చెప్పి పీఠం చూశాడని, అనంతరం ఫొటో దిగుదామని చెప్పాడని, అంతకుమించి తనకు తెలియదని వివరించాడు. ఫొటో అప్‌లోడ్‌ చేస్తోన్న సమయంలో లైవ్‌ లొకేషన్‌ తీసుకుని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆపై లోన్‌ ప్రాసెస్‌ చేసినట్లుగా అనుమానించి, లీలాకుమారి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి, ఉయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఈ సంస్థ చేతిలో ఉయ్యూరు, గరికపర్రు, పెనమలూరు, కనకవల్లి ప్రాంతాలకు చెందిన పలువురు ఇలాగే చిక్కుకున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement