భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యా వికాశమే ధ్యేయంగా రాష్ట్ర మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతికి వక్ఫ్‌బోర్డు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ అన్నారు. వక్ఫ్‌బోర్డు దాదాపు రూ.5 కోట్లతో మెరిట్ విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం హర్షణీయన్నారు. పదో తరగతిలో 450 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఉచిత రెసిడెన్షియల్ విద్యా అందించేందుకు వక్ఫ్‌బోర్డ్ నిర్ణయం తీసుకోవడం ముదావహమన్నారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, వక్ఫ్‌బోర్డ్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన తాలిమ్–ఎ–హునర్ టాలెంట్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన 250 మంది విద్యార్థులకు కాలేజి అలాట్‌మెంట్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి ఫరూఖ్ మాట్లాడుతూ.. ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు చట్టపరమైన చర్యలను వేగవంతం చేస్తామన్నారు.
పోటీని తట్టుకునేందుకు రెసిడెన్షియల్ విద్య..
రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. తాలిమ్–ఎ–హునర్ టాలెంట్ టెస్ట్‌కు 7400 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 250 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను విజయవాడలోని చైతన్య గోశాల క్యాంపస్‌లో చేర్పించి ఉన్నత విద్యను అందించబోతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్సీ జకియా ఖానమ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు షరీఫ్ మహ్మద్, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్‌రావు, నజీర్ అహ్మద్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షుబ్లీ, డీసీపీ షిరీన్ బేగం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఏ.తమీమ్ అన్సారియా, ఏపీ నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, షేక్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్, వక్ఫ్‌బోర్డ్డు సీఈఓ యాకుబ్ బాషా, ముతవల్లీలు పాల్గొన్నారు.


