క్షణికావేశంలో చెక్కపీటతో దాడి
కంకిపాడు: క్షణికావేశం ఓ ప్రాణాన్ని బలిగొంది. మామ అల్లుడు మధ్య తలెత్తిన ఘర్షణలో అల్లుడు చెక్కపీటతో కొట్టడంతో మామ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు... కృష్ణాజిల్లా గన్నవరం మండలం అల్లాపురం గ్రామానికి చెందిన తిరువీధి నాగరాజు (47) తన కుమార్తె రేణుక బేబీని కోలవెన్ను గ్రామానికి చెందిన లాం అవినాష్‌కు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం జరిపించాడు. రేణుక బేబీ దంపతులకు ఒక ఆడబిడ్డ సంతానం. మరలా గర్భందాల్చింది. ఈనెల 13న నాగరాజు కోలవెన్నులోని కుమార్తె ఇంటికి వచ్చాడు. మనవరాలిని పక్క వాళ్లకు అప్పగించి కుమార్తెను వైద్య పరీక్షల నిమిత్తం కంకిపాడుకు తీసుకువెళ్లాడు. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి వద్ద ఉన్న అవినాష్ తన కుమార్తెను కూడా తీసుకెళ్లకుండా పక్కవారికి ఎందుకు అప్పగించారంటూ భార్యతో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అవినాష్‌కు నాగరాజు అడ్డుతగలటంతో అవినాష్ కోపంతో తనకు చేతికి దొరికిన చెక్కపీటతో నాగరాజు తలపై కొట్టాడు. కనిపించని గాయమై బాధతో విలవిలలాడుతుండగా కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రి వర్గాల సమాచారంతో పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదుచేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.


