అక్విడెక్టు
రక్షణకు ఖర్చు
చేసిందెంత?
అక్విడెక్టుకు ఏమి చేశారో చెప్పాలి
పనులన్నీ పూర్తి చేశాం
అవనిగడ్డ: దివి సీమకు జీవనాడి అయిన అక్విడెక్టుకు ప్రమాదం పొంచివుంది. లీకులను అరికట్టే చర్యలు చేయకుండా రెయిలింగ్ కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టారు. కాలువ తొట్టె భద్రతకు చర్యలు చేపట్టకుండా రెయిలింగ్‌కు రంగులు వేసి ౖపైపె మెరుగులు దిద్దడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ జేబులు నింపడానికి తప్ప రైతులకు ఒనగూరే ప్రయోజం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దివిసీమ రైతులకు సాగు, ప్రజల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారం పులిగడ్డ అక్విడెక్టు. అక్విడెక్టు పంట కాలువల ద్వారా అవనిగడ్డ, నాగాయ లంక, కోడూరు మండలాల్లోని 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1.25 లక్షల జనాభా దాహార్తి తీరుతుంది. 1936లో ఒకతొట్టెతో కలిపి అక్విడెక్టును నిర్మించగా, 1977లో రెండో తొట్టెతో పంటకాలువను విస్తరించారు.
లీకేజీ నివారణ చర్యలేవీ?
ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ పంట కాలువలకు లీకులు కాకుండా కొబ్బరి నార, తారుతో మరమ్మతులు చేస్తారు. గత ఏడాది అక్విడెక్టు నిర్వహణలో భాగంగా నాలుగు పనుల కోసం రూ.110.05 లక్షలు ఎస్‌డీఎంఎఫ్ (స్టేట్ డిజాస్టర్ మీటిగేషన్ ఫండ్) నిధులు మంజూరయ్యాయి. ఇన్ని నిధులు వచ్చినా పంటకాలువ తొట్టె జాయింట్ల వద్ద లీకులు తలెత్తకుండా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. రెండు రోజుల క్రితం అక్విడెక్టుకు నీరు వదలగా పంటకాలువ తొట్టెలో ప్రతి జాయింట్ వద్ద లీకేజీ ఏర్పడి నదిలోకి నీరు కారుతోంది. అక్విడెక్టు రహ దారి వైపున ఫిల్లర్ల పైనుంచి లీకై నీరు కారుతుంది. లీకులు పెరిగితే పంటకాలువ తొట్టె దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే దివిసీమకు సాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
రాకపోకలు లేని రెయిలింగ్ కోసం రూ.లక్షలు
అక్విడెక్టుపై రాకపోకలు సాగించే సమయంలో ప్రయాణి రక్షణ కోసం ఇరువైపులా ఇనుప రాడ్లతో రెయిలింగ్ ఏర్పాటు చేశారు. 2008లో అక్విడెక్టుకు కూతవేటు దూరంలో కొత్తగా హైలెవల్ వంతెన నిర్మించారు. అప్పటి నుంచి అక్విడెక్టుపై రాకపోకలను నిషేధించారు. పాత రెయిలింగ్ అక్కడక్కడ దెబ్బతినగా వాటికి మరమ్మతులతో సరిపెట్టాల్సిందిపోయి వాటి స్థానంలో కొత్త రెయిలింగ్, పెయింట్ కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటకాలువ తొట్టె జాయింట్ల వద్ద పెచ్చులూడి పడిపోతున్నా వాటికి కనీసం మరమ్మతులు చేయలేదు. జాయింట్ల వద్ద నీరు లీకు కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
చాంబర్ల మరమ్మతులపైనా అనుమానాలు
అక్విడెక్టుకు మొత్తం 36 ఫిల్లర్లు ఉన్నాయి. ఫిల్లర్ విడచి ఫిల్లర్‌కు చాంబర్లు ఉన్నాయి. రహదారిపై వాహనాలు వచ్చేటప్పుడు, వరదల సమయంలో ఒత్తిడిని నివారించేందుకు వీటిలో ప్రత్యేక స్ప్రింగ్‌లు అమర్చారు. వీటికి ప్రతి రెండేళ్లకోసారి గ్రీజు పెడుతుంటారు. గత ఏడాది మంజూరైన నిధులతో వీటికి మరమ్మతులు చేసి పైన బాక్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. పులిగడ్డ వైపున ఒక చాబర్‌కు గ్రీజు పెట్టకుండా బాక్సు లేకుండా వదిలేయడం చూస్తుంటే మిగిలిన నాణ్యతపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్విడెక్టు తొట్టె జాయింట్ వద్ద ఊడిన పెచ్చు
ప్రస్తుత ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 20 ఏళ్లు అధికారంలో ఉన్నారు. మేమున్నది ఐదేళ్లు. అందులో రెండేళ్లు కరోనా కాలం. మా హయాంలో అక్విడెక్టు శిథిలావస్థకు చేరిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన అక్విడెక్టుకు చేసిందేమిటి? రూ.కోటికి పైగా నిధులు మంజూరైతే రంగులు వేయించి రక్షణ చర్యలు చేశామని చెప్పడానికి సిగ్గుండాలి.
– సింహాద్రి రమేష్‌బాబు,
మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ
పంటకాలువ తొట్టె జాయింట్ల వద్ద లీకులు రాకుండా పటిష్టంగా పనులు చేశాం. దెబ్బతిన్న చాంబర్లకు మరమ్మతులు చేయించి గ్రీజు పెట్టించాం. ఎస్టిమేట్‌లో లేకపోయినా కాంట్రాక్టర్‌ను ఒప్పించి చాంబర్లకు పై షీట్లు బిగించాం. నాలుగు పనులకు మంజూరైన రూ.110.05 లక్షల పనులన్నీ పూర్తిచేశాం.
– బి.బి.ఎస్.గణపతి,
ఇరిగేషన్ డీఈఈ, పులిగడ్డ
అక్విడెక్టుకు మరమ్మతుల కోసం మంజూరైన రూ.110.05 లక్షలు ఎస్‌డీఎంఎఫ్ నిధుల్లో నిర్వ హణ కోసం ఖర్చు చేసింది తక్కువనే చెప్పాలి. పులిగడ్డలో ఆర్‌ఎఫ్‌ఆర్ (రైట్ ప్లాంక్ రెగ్యులే టర్) నిర్వహణకు రూ.36.55 లక్షలు, మోపిదేవి వైపు ఎల్‌ఎఫ్‌ఆర్ నిర్వహణ కోసం రూ.29.40 లక్షలు, పులిగడ్డ వద్ద ఎల్‌ఎఫ్‌ఆర్ వద్ద నిర్వహణ కాలువ పనులకు రూ.23.10 లక్షలు, పులిగడ్డ వద్ద ఆర్‌ఎఫ్‌ఆర్ వైపు కాలువకు మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.21 లక్షలు ఖర్చు చేసి నట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో అక్విడెక్టు రక్షణ కోసం ఖర్చు చేసింది చాలా తక్కువే. గత ఏడాది వచ్చిన వరదలకు కొట్టుకొచ్చిన కొన్ని భారీ వృక్షాలు అక్విడెక్టు వద్ద పట్టుకుపోగా వాటిని కూడా తొలగించే చర్యలు చేయలేదు.


