ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కడప చిన్న చౌక్‌కు చెందిన కె. గోపిరెడ్డి కుటుంబం అయ్య వరమ్మ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడుకు చెందిన వై.కనకదుర్గ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,01,116ల విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన గోగినేని సావిత్రి కుటుంబం మౌత్విక, మోహినిష్‌సాయి పేరిట రూ.లక్ష విరాళం అందజేసింది.
పీహెచ్‌సీల్లో మాతృ సంరక్షణ చర్యలు చేపట్టాలి
పెనమలూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతృ సంరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి.యుగంధర్ ఆదేశించారు. ఆయన శనివారం పెనమలూరు పీహెచ్‌సీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో మాతృ సంరక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సేవల్లో నిర్లక్ష్యం తగదన్నారు. సాధారణ కాన్పులు పెంచటానికి ఏఎన్‌ఎంలకు, ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. డయేరియా, డెంగీ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్స్ పోలియోపై యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీలో ఉన్న బ్లాక్ హెల్త్ యూనిట్‌ను ప్రారంభించటానికి చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ యుగంధర్ ఆదేశించారు. ‘బ్లాక్ హెల్త్ పబ్లిక్ యూనిట్‌కు గ్రహణం’ శీర్షికన ఈ నెల 10వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. యూనిట్‌లో అన్నిరకాలు పరికరాలు సమకూర్చి మెక్రో బయోలజీ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రరంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాయిలలిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీఐఎంఎస్‌ఈఏ విజయవాడ రీజనల్ కమిటీ ఎన్నిక
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ఇన్‌సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఐఎంఎస్‌ఈఏ) విజయవాడ రీజనల్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలో శనివారం జరిగిన అసో సియేషన్ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఆర్.ప్రవీణ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సి.సిద్దావలి, సెక్రటరీ ఎస్.మురళీ, జాయింట్ సెక్రటరీగా వి.చలపతిరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి.మంగతాయారు, ఆర్.నల్లయ్య, బేతపూడి రాము, జి. రాజేష్, బి.నాగరాజు, వి.మోహనరావు, ఎన్.ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.శేషగిరిరావు, స్టేట్ సెక్రటరీ వి.సురేష్‌కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.గిరిధర్ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.
రేపు యాత్రి సౌకర్య దివస్
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) 12 ఏళ్ల ప్రగతి, విజయాలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ‘యాత్రి సౌకర్య దివస్’ నిర్వహించనున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణి కుల సౌకర్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలు చేపట్టను న్నట్లు పేర్కొన్నారు. 12 ఏళ్లలో విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించి దేశీయ విమాన రంగంలో కీలక కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. 2014–15లో రూ.5.98 కోట్లు ఉన్న ఎయిర్‌పోర్ట్ వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.87.97 కోట్లకు చేరిందని, ప్రయాణికుల సంఖ్య 2.33 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగిందని వివరించారు. అంతర్జాతీయంగా షార్జా, సింగపూర్‌కు విమాన సర్వీస్‌లు నడుస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం రూ.791.59 కోట్లతో 51,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నూతన ఏటీసీ టవర్, టెక్నికల్ బ్లాక్ నిర్మాణం పూర్తికావడంతో పాటు డీజీ యాత్ర, వైఫై, ఫ్టాస్టాగ్ ఆధారిత పార్కింగ్, ఉడాన్ యాత్రి కేఫ్ వంటి సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


