భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన ప్రముఖ రచయిత, పద్య నాటక కళాకారుడు డాక్టర్ కంచర్ల వేంకటలక్ష్మీనరసింహ శర్మ (కేవీఎల్‌ఎన్ శర్మ)కు నంది పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు వెలుగు సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో శనివారం వరంగల్ టీఎన్‌జీఓ భవనంలో నిర్వహించిన తెలుగు వెలుగు పురస్కారాల మహోత్సవంలో డాక్టర్ శర్మను సత్క రించి మహా నంది పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘లవంగి’ పుస్తకానికిగాను 2017లో ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్, ‘జగన్నాథ పండిత రాయలు’ పుస్తకానికిగాను అదే సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ మరో డాక్టరేట్ ప్రదానం చేయడం ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. డాక్టర్ శర్మకు మహా నంది పురస్కారం లభించడంపట్ల పలువురు సాహితీవేత్తలు అభినందించారు.


