5న రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

5న రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అవార్డులు

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

5న రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అవార్డులు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రతి ఏటా అందించే రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ 13వ వార్షిక అవార్డులను జూలై 5వ తేదీన అందజేయనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్‌, ఎస్‌ఎల్‌వీ బిల్డర్స్‌ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారానికి జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఘట్టమనేని లక్ష్మీప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. రూట్స్‌ అవార్డులకు సీనియర్‌ ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ పీఎస్‌ఎన్‌మూర్తి, మధుమేహ నిపుణులు డాక్టర్‌ కొండా వేణుగోపాలరెడ్డి, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కోడే ప్రభాదేవి, సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కేశవరావు బాబు, బేరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ గాజుల రమేష్‌, జిరియాట్రిక్‌ కేర్‌ నిపుణులు డాక్టర్‌ అక్కినేని మణి, యువ వైద్యుల విభాగంలో గుంటూరుకు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ పొట్ల శివయ్య, పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ కంచర్ల అనీల్‌లను అవార్డులు అందజేస్తామన్నారు. అదే విధంగా ఆయుర్వేదిక్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కొండా వెంకటేశ్వర్లు, ఉత్తమ సేవా విభాగంలో తేజలాల్‌ సోలాంకిని ఎంపిక చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీవీఎస్‌ భాస్కర్‌, సంజయ్‌ పాల్గొన్నారు.

మైలవరం: ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... కీర్తిరాయునిగూడెం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక ఇంటి వద్ద ఈ నెల 10వ తేదీన ఆడుకుంటుంది. అదే సమయంలో గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి చిన్నారిపై అత్యాచార యత్నం చేయబోయాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు మైలవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కోనేరుసెంటర్‌: కుటుంబ పరువు పోతుందని మనస్తాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. మచిలీపట్నం ఎస్‌ఐ జగదీష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలశెట్టి సాయిబాబు (61) గిలకలదిండిలో హోటల్‌ నడుపుతుంటాడు. అతని కుమారుడు సాయివర్మ శుక్రవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు శ్యామ్‌, సుందరంలతో కలిసి మద్యం తాగాడు. సాయివర్మ, శ్యామ్‌ మద్యం తాగుతుండగా శ్యామ్‌కు సుందరంకు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో శ్యామ్‌ చేయి విరిగింది. దీంతో శ్యామ్‌ కుటుంబసభ్యులు, బంధువులు కలిసి సాయివర్మ ఇంటికి వెళ్లి సాయివర్మ కారణంగా ఈ పరిస్థితి వచ్చిందంటూ గొడవ పడ్డారు. కుమారుడు వలన ఇంటి పరువు వీధికి ఎక్కుతుందంటూ మనస్తాపం చెందిన సాయిబాబు అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున ఫ్యానుకు వేలాడుతున్న సాయిబాబును చూసిన కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో కిందికి దింపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement