జి.కొండూరు: విద్యుత్ స్తంభంపై సర్వీస్ వైర్ సరి చేస్తుండగా వ్యక్తి మృతి చెందిన ఘటన జి.కొండూరు మండల పరిధి గంగినేని గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన తాటిమట్ల వెంకటకృష్ణారావు(49) కేబుల్ ఆపరేటర్ వద్ద టెక్నీషియన్‌గా పని చేస్తూ విద్యుత్ పరికరాలు సైతం రిపేర్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో గంగినేని సహకార సొసైటీకి విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో సొసైటీకి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపై సర్వీసు వైర్‌ను సరి చేసేందుకు శనివారం మధ్యాహ్న సమయంలో స్తంభం పైకి ఎక్కాడు. విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా స్తంభం ఎక్కడంతో స్తంభం పైన ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వెంకటకృష్ణారావు విద్యుత్ స్తంభం పైకి ఎక్కే సమయంలో సొసైటీ సంఘం పెద్దలు అక్కడే ఉన్నారని, విద్యుత్ షాక్ తగిలి మృతి చెందగానే అక్కడి నుంచి వెళ్లి పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు సహకార సొసైటీ పెద్దలను నిలదీయగా తమకేమీ సంబంధం లేదని, వారు బుకాయించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ పెద్దలు తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని కదిలించేదిలేదని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని మద్దతుగా నిలిచారు. ఎట్టకేలకు సొసైటీ సభ్యుల హామీతో వారు ఆందోళనను విరమించారు.


