కోనేరుసెంటర్: అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం రుస్తుంబాదకు చెందిన మాదివాడ రామ్‌చరణ్ (17) ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. మరలా సప్లిమెంటరీకి ఫీజు కట్టి చదువుకుంటున్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి తన తాత గదిలో పడుకుంటానని తల్లికి చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం చరణ్ ఎంతకీ బయటికి రాకపోవటంతో తల్లి తేజాశ్వేత నిద్ర లేపేందుకు వెళ్లిచూడగా చరణ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. బిడ్డను విగతజీవిగా చూసిన తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కుటుంబసభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చరణ్ తల్లి తేజాశ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


