జిల్లాలో భూకంపాలు
రాత్రి వేళ 2:26 గంటలకు
స్వల్పంగా కంపించిన భూమి
పాల్వంచ మండలంలోని పలు
గ్రామాల్లో ప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై 3.8గా భూకంప
తీవ్రత నమోదు
పాల్వంచ–అశ్వాపురం మండలాల సరిహద్దులో భూకంప కేంద్రం
స్వల్పంగా కంపించిన ఇళ్లు, పలుచోట్ల పురాతన నిర్మాణాలకు పగుళ్లు
పాల్వంచరూరల్/బూర్గంపాడు/పాల్వంచ: భద్రాద్రి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి 2:26 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. పాల్వంచ మండలం సారెకల్లు, అశ్వాపురం మండలం మామిళ్లవాయి గ్రామాల మధ్యలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూకంప కేంద్రంగా ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విభాగం గుర్తించింది. భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండగా, తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8 నమోదైంది. పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, జగన్నాథపురం, కేశవాపురం, సారెకల్లు, కారెగట్టు ప్రాంతాలతోపాటు పాల్వంచ పట్టణం, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ప్రకంపనలతో ఉలిక్కిపడి బయటకు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. మరికొందరు భూకంప ప్రభావమేమీ కనిపించలేదని పేర్కొంటున్నారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంచం, తలుపులు స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని, భూకంపంమే అని భావించి కుటుంబ సభ్యులతో బయటకు వచ్చామని పాల్వంచ గట్టాయిగూడేనికి చెందిన లింగం వెంకటేశ్వర్లు తెలిపారు.
తక్కువ లోతు కావడంతో..
భూమి లోపలి పొరల్లో జరిగే ఘర్షణల కారణంగా భూకంపాలు తరచుగా సంభిస్తుంటాయి. వీటి తీవ్రతను రిక్టరు స్కేలు సాయంతో గుర్తిస్తుంటారు. భూకంపం తీవ్రత, అది సంభవించిన లోతును, భూ ఉపరితలం పరిస్థితుల ఆధారంగా భూకంప ప్రభావం ఉంటుంది. సాధారణంగా రిక్టర్ స్కేల్‌పై 3 కంటే తక్కువగా నమోదు అయ్యే కంపనాల గురించి సామాన్యులకు అర్థం కూడా కాదు. భూకంప తీవ్రత 3.5 దాటితే స్వల్పంగా ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుత భూంకప తీవ్రత 3.8 నమోదుకాగా, ఇది అంత ప్రమాదకరమైనది కాకపోయినా భూ ఉపరితలం నుంచి కేవలం 10 కి.మీ లోతులో కంపన కేంద్రం ఉండటం వల్ల తీవ్రత పెరిగింది. అందువల్లే అర్థరాత్రి 2.26 గంటల సమయంలో భూమి కంపించినా కొందరు ప్రజలు గుర్తించగలిగారు. అంతకుముందు 2024 డిసెంబర్ 4న ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉదయం 7:27 గంటల సమయంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై ప్రమాదకర స్థాయిలో 5.3గా నమోదైంది. ఈ భూకంప తీవ్రత ఉత్తర తెలంగాణ అంతా చవిచూసింది. అయితే, అప్పుడు 40 కి.మీ.లోతులో భూకంప కేంద్రం ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది.
భూకంపాలు ఎప్పుడెప్పుడు వచ్చాయంటే..
గోదావరి తీరంలో విస్తరించిన జిల్లాకు భూకంపాలు కొత్తేమి కాదు. 1954లో రిక్టర్ స్కేల్‌పై 4.3 భూకంప తీవ్రత నమోదుకాగా, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 1969లో దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర 5.3 తీవ్రతతో భూంకపం వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాకు సంబంధించినంత వరకు అతి పెద్ద భూకంపంగా ఇది రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత 2004లో మరోసారి వచ్చింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2018 ఆగస్టు 14న జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, బూర్గంపాడు ప్రాంతాల్లో రాత్రి వేళ కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. మళ్లీ 2023 ఆగస్టు 25 తెల్లవారుజామున మణుగూరులో భూమి కంపించిన అనుభూతిని ప్రజలు పొందారు. 1968, 2004, 2009ల్లో కూడా స్వల్ప భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చివరిసారి 2024 డిసెంబరులో ములుగులో వచ్చిన భూకంపానికి రాష్ట్రం మొత్తం వణికిపోయింది.
తేదీ తీవ్రత సమయం
5 –7– 1969 5.3 ––
14 –8–2018 5.1 9:10 పీఎం
25 –8–2023 3.5 4:45 ఏఎం
04–12–2024 5.3 7:27 ఏఎం
13 –6– 2026 3.8 2.26 ఏఎం


