స్కెచ్‌ విజయవాడలో.. | - | Sakshi
Sakshi News home page

స్కెచ్‌ విజయవాడలో..

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

● అక్కడ సాధ్యం కాక ఖమ్మంలో చోరీ ● సోనోవిజన్‌ చోరీపై ముమ్మరంగా దర్యాప్తు కర్ణాటకలో చిక్కిన బంగారం చోరీ ముఠా?

● అక్కడ సాధ్యం కాక ఖమ్మంలో చోరీ ● సోనోవిజన్‌ చోరీపై ముమ్మరంగా దర్యాప్తు

ఖమ్మంలో గత నెల జరిగిన భారీ బంగారం చోరీ కేసులో త్రీటౌన్‌ పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. మే 20వ తేదీన నగల వ్యాపారి వంకాయల కార్తీక్‌ ద్విచక్రవాహనానికి తగిలించిన రూ.50లక్షలకు పైగా ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను నిందితులు ఎత్తుకెళ్లారు. ఈమేరకు విచారణలో భాగంగా నిందితులు కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌గా గుర్తించినట్లు తెలిసింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు గ్యాంగ్‌లోని ముఖ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. త్వరలో భారీ చోరీ కేసు మిస్టరీ వీడే అవకాశముందని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

ఖమ్మంక్రైం: ఖమ్మం వైరారోడ్డులో సోనోవిజన్‌ షోరూమ్‌లో రూ.66లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్ల చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 11న తెల్లవారుజామున చోరీ జరగగా అన్ని కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాల పుటేజీ ఆధారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. ఈ విచారణ క్రమంలో ఇప్పటికే కీలకమైన అంశాలను గుర్తించినట్లు సమాచారం.

అనుకూలంగా లేదని..

దొంగల ముఠా తొలుత విజయవాడలోని సోనోవిజన్‌ షోరూమ్‌లో భారీ చోరీకి ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. అయితే, అది ప్రధాన షోరూం కావడం, సెక్యూరిటీ పటిష్టంగా ఉండడంతో తమ ప్రయత్నం విరమించుకున్నట్లు సమాచారం. ఆపై ఖమ్మం షోరూంను ఎంచుకుని దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యాన శనివారం పోలీసులు విజయవాడ వెళ్లి అక్కడి షోరూంతో పాటు సమీప షాపుల్లో సీసీ ఫుటేజీ పరిశీలించినట్లు సమాచారం.

టోల్‌గేట్లు టచ్‌ కాకుండా..

విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే క్రమాన ముఠా సభ్యులు టోల్‌ గేట్ల మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నట్లు తెలిసింది. టోల్‌గేట్ల నుంచి వస్తే సులువుగా ఆచూకీ తెలుస్తుందనే భావనతో నందిగామ, కోదాడ హైవే కాకుండా బోనకల్‌ మీదుగా ఖమ్మం చేరుకున్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తద్వారా ముఠా సభ్యులు ఈ ప్రాంత రహదారులపై ముందుగానే అధ్యయనం చేసి ఉంటారని తెలుస్తోంది.

సరిహద్దు దాటేశారా?

ఖమ్మంలో సెల్‌ఫోన్లు చోరీ చేసిన నిందితులు ప్రయాణించిన కారుకు అసలు నంబర్‌ ప్లేట్‌ కాకుండా నకిలీది అమర్చినట్లు తెలిసింది. చోరీ జరిగిన రోజే కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తే ఆ నంబర్‌ గుంటూరులో రిజిస్టర్‌ కాగా, నిందితులు వచ్చింది వేరే కారు అని తేలినట్లు సమాచారం. దీంతో నంబర్‌ ప్లేట్లు మారుస్తూ నిందితులు రాష్ట్రాల సరిహద్దులు దాటి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. ఈమేరకు ఖమ్మం నగర, సీసీఎస్‌ ఏసీపీలు రమణమూర్తి, సర్వర్‌ ఆధ్వర్యాన ప్రత్యేక బృందాలు దర్యాప్తు ముమ్మరం చేయగా... అనుమానం ఉన్న అన్ని మార్గాల్లోని సీసీ టీవీల పుటేజీలను జల్లెడ పడుతున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement