అటవీ అధికారుల తీరు సరికాదు | - | Sakshi
Sakshi News home page

అటవీ అధికారుల తీరు సరికాదు

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లిలోని గుడిపాడులో 25ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులు ఏటా అడ్డుకోవడం సరికాదని పీఓడబ్ల్యూ రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ పేర్కొన్నారు. గుడిపాడులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అటవీ అధికారులు ప్రతీ సీజన్‌లో పోడుదారులు, మహిళలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా సర్వే చేసి పట్టాలు ఇవ్వడమే కాక ఆదివాసీ గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు శిరోమణి, ఝాన్సీ, దుర్గా, సరోజిని, పద్మ, నర్సమ్మ, పరిమళ, అమర్లపూడి శరత్‌, నాగిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి రూ.65వేల ఆర్థికసాయం

కల్లూరురూరల్‌: కల్లూరుకు చెందిన దోసపాటి సర్వేశ్వరరావు కుటుంబానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన శనివారం రూ.65వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల సర్వేశ్వరరావు భార్య సుజాత మృతి చెందగా, నిరుపేద కుటుంబం కావడంతో సంఘం ఆధ్వర్యాన విరాళాలు సేకరించారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా, మండల అధ్యక్షులు పసుమర్తి చందర్‌రావు, అనుములు శ్రీనుతో పాటు దోసపాటి కృష్ణార్జున్‌రావు, నాళ్ల శ్రీనివాసరావు, రాచమళ్ల నాగేశ్వరరావు, దోసపాటి శ్రీనివాసరావు, పసుమర్తి రాంబాబు, చారుగుండ్ల సందీప్‌, ఎస్‌.పుల్లారావు పాల్గొన్నారు.

అసోసియేషన్ల వివరాలు సమర్పించాలి

ఖమ్మం స్పోర్ట్స్‌: హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఎన్నికల నిర్వహణకు గాను మండలాల వారీగా వివరాలను ఈనెల 16వ తేదీలోగా అందజేయాలని ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సూచించారు. జాబితాలను పరిశీలించాక ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈమేరకు వివరాల కోసం 73966 69337 నంబర్‌లో సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించారు.

వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై విచారణ

తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్‌సీలో ఓ వృద్ధుడి చికిత్స సమయాన వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన కుటుంబీకులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజశేఖర్‌గౌడ్‌ ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. తిరుమలాయపాలెంకు తూమాటి కాంతయ్యకు వైద్యం చేసిన డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృపా ఉషశ్రీ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించకుండా ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

తెలుగును సరళతరం చేస్తే కలకాలం మనుగడ

ఖమ్మం మామిళ్లగూడెం: కలకాలం నిలిచేలా తెలుగును మరింత సులభతరం చేసేలా లిపి రూపొందించినట్లు కొణిజర్ల మండలం బస్వాపురం ఎంిపీపీఎస్‌ ఉపాధ్యాయుడు చంద్రగిరి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఖమ్మంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇసుక దిబ్బలు, తాళపత్ర గ్రంథాలు, శిల్పాలపై చెక్కిన ప్రతీ సందర్భంలోనూ పూర్వీకులు లిపిని సరళం చేస్తూ వచ్చారని తెలిపారు. ఈక్రమాన రేపటి డిజిటల్‌ యుగం అవసరాలకు అనుగుణంగా అక్షరాలను సంస్కరించి తెలుగు ఎన్నటికీ వెలిగేలా లిపిలో మార్పులు చేశానని పేర్కొన్నారు. ప్రధానంగా ఒత్తులు గుర్తు పెట్టుకోవడంలో నేటి తరం ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement