సోమవారం నుంచి అందుబాటులోకి యాప్ ఒక్కో రైతుకు తొలుత రెండు బస్తాలు.. ఫోన్ లేకపోతే ఏఈఓలు, మీ సేవల్లో బుకింగ్‌కు అవకాశం
సరిపడా సరఫరా
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు ఎరువుల ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఎరువుల తయారీ ముడి పదార్థాలు ధరలు, రవాణా ఖర్చులు పెరిగి ఎరువుల ధరలు కూడా పెరిగాయి. ఈనేపథ్యాన గత ఏడాది వానా కాలం నుంచి యూరియా సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో యాసంగి సీజన్ నుంచి ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే యూరియా సరఫరా చేస్తోంది. ఈసారి కూడా ఇదే విధానం అమలుకు నిర్ణయించింది.
క్యూలో నిలబడకుండా..
జిల్లాలో సోమవారం నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని నిర్ణీత సెంటర్‌కు, నిర్ణీత తేదీలో వెళ్తే యూరియా అందిస్తారు. ఫలితంగా రైతులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన బాధ తప్పుతుందని అధికారులు చేపడుతున్నారు. ఈమేరకు పీఏసీఎస్‌లు, డీలర్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
నాలుగు స్టెప్పుల్లో బుకింగ్
తొలుత స్మార్ట్ ఫోన్‌లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఆపై రైతు(పీపీబీ/ఆర్‌ఓఎఫ్‌ఆర్/ఎన్‌డీఎస్) ఎంపిక చేసి లాగిన్ కావాలి. అనంతరం సాగు వివరాలను నమోదు చేసి, అవసరమైన యూరియా బస్తాల సంఖ్య నమోదు చేసి బుకింగ్ చేసుకోవాలి. ఆతర్వాత వచ్చే గుర్తింపు నంబర్‌ను డీలర్‌కు చూపించి యూరియా బ్యాగ్‌లు కొనుగోలు చేయొచ్చు.
ఇక్కట్లు రాకుండా...
గత సీజన్‌లోనూ యాప్ ద్వారా యూరియా అమ్మకాలు చేపట్టినా ఇక్కట్లు ఎదురయ్యాయి. యాప్ సరిగ్గా పనిచేయక, రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేక సమస్యలు వచ్చాయి. దీంతో తొలుత ఒక్కో రైతు రెండు బస్తాల యూరియా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు జిల్లాలో సాగయ్యే పంటల ఆధారంగా 30వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 14,135మె.టన్నుల యూరియా జిల్లాలో ఉంది. ఇదిగాక రిజర్వ్‌లో మరో 6,197 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తున్నందున పంటల మార్పిడి జరిగితే యూరియా వినియోగం తగ్గే అవకాశముంది. తద్వారా సమస్య రాదని భావిస్తున్నారు. అంతేకాక యూరియా బుకింగ్‌లో సమస్యలు అధిగమించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18001237157ను ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించే వీలు కల్పించారు. అలాగే, స్మార్ట్ ఫోన్ లేని వారు ఏఈఓలను కానీ మీ సేవ, సీఎస్పీ సెంటర్లలో ద్వారా బుక్ చేసుకోవచ్చని అవగాహన కల్పిస్తారు.
రైతులు అపోహలకు గురికావొద్దు. పంటల సాగుకు అనుగుణంగా అవసరమైన యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. యాప్ ద్వారా బుక్ చేసుకొని పొందొచ్చు. జిల్లాలో ఇబ్బంది రాకుండా చూస్తాం.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి


